ఆయన నిర్దిష్టంగా ఫలానా పార్టీకి చెందిన నాయకుడు అని చెప్పడం కష్టమే గానీ.. ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా హోదా వెలగబెడుతున్నారు గనుక.. ఆ పార్టీ వ్యక్తే అని అనుకోవాలి. కానీ ఆయన ప్రస్తుతం కాంగ్రెసు మీద అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్నారు. ఏం చేస్తే కాంగ్రెసు పార్టీ గెలుస్తుందో తన సలహాలు సూచనలు అందిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ వ్యూహకర్తల్లాగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. బీసీ నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న ఆర్. కృష్ణయ్య.
తెలంగాణకు చెందిన ఈ నాయకుడు 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి ఫ్లోర్ లీడర్ అయ్యారు. కానీ.. పార్టీకి దూరం అయ్యారు. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు. తద్వారా, ఏపీలో ఆయన దృష్టిలో బీసీ నాయకుడే ఎవరూ లేనట్లుగా, తెలంగాణ నుంచి కృష్ణయ్యను అరువు తెచ్చుకున్నారనే విమర్శలను కూడా జగన్ ఎదుర్కొన్నారు. ఎంపీ అయిన తర్వాత కూడా కనీసం ఏపీలో వైసీపీ ప్రాభవానికి ఏమాత్రం ఉపయోగపడకుండా ఉన్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తెలంగాణలో విజయం సాధించడానికి మెళకువలను కాంగ్రెసు పార్టీకి బోధించే బాధ్యత తీసుకున్నారు.
చేవెళ్లలో పార్టీ దళిత డిక్లరేషన్ విడుదల చేసిన తర్వాత.. దాని గురించి పార్టీల వారీగా అనుకూల ప్రతికూల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణయ్య తెరమీదకు వచ్చి బీసీ డిక్లరేషన్ కూడా విడుదల చేస్తే పార్టీ తప్పకుండా గెలుస్తుందని సలహా ఇస్తున్నారు. చట్టసభల్లో బీసీలకు యాభైశాతం సీట్లు రిజర్వు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ మొత్తం 18 అంశాలతో మాణిక్ రావు ఠాక్రేకు ఒక లేఖ రాశారు. పనిలో పనిగా తెలంగాణలో 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని కూడా సీఎం కేసీఆర్ కు ఇంకో లేఖ రాసేశారు.
అంతా బాగానే ఉంది. ఆయన తెలంగాణ ప్రాంత వ్యక్తి అయినందువల్ల అక్కడి ప్రజల బాగును కోరుకోవడం మంచిదే.. కానీ.. ఆయనను ఎంపీగా చేసిన ఏపీ ప్రజల గురించి కూడా కాస్త ఆలోచించవచ్చు కదా. ఆయన మాటల, లేఖల వెనుక నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. ఏపీలో కూడా బీసీ డిక్లరేషన్ తేవాలని తమ అధినేత జగన్ కు చెప్పవచ్చు కదా. ఏపీలో కూడా ఉపాధ్యాయ ఖాళీల భర్తీని చేపట్టాలని అక్కడి సీఎంకు లేఖ రాయవచ్చు కదా అనేది ప్రజలు డౌటు.