దేశ ప్రధాని పదవిపై తమకు ఆశ లేదని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం తాజాగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా కనిపిస్తోంది. 26 పార్టీల కూటమి తమది, తాము చాలా బలమైన కూటమిగా ఉన్నాం, 11 రాష్ట్రాలలో తమకూటమి పార్టీల అధికారంలో ఉన్నాయి.. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో 2024 ఎన్నికలలో ప్రధాని మోడీని గద్దించడం తమకూటమికి చాలా సునాయాసమైన విషయం అన్నట్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెలవిస్తున్నారు. ఈ బలం గురించిన అంచనాలన్నీ నిజమే అయితే కనుక ‘కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని ఎందుకు త్యాగం చేయానుకుంటుంది’ అనే సందేహం పలువురిలో తలెత్తుతోంది.
నిజానికి ఇప్పుడు జట్టు కట్టిన చిన్నాచితకా పార్టీలలో అన్నీ కూడా కాంగ్రెస్ సారధ్యానికి సుముఖంగానే ఉన్నాయి. ప్రధాని పదవి మీద మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లకు ఆశ ఉన్నప్పటికీ, వారు మెజారిటీ అభిప్రాయం ప్రకారం వెళ్లే అవకాశం ఉంది. అయితే విపక్షాలు నిర్వహించిన రెండో భేటీలోనే తమకు ప్రధాని పదవి మీద ఆసక్తి లేనేలేదని కాంగ్రెస్ తేల్చి చెప్పేయడం సందేహాస్పదంగా ఉంది. మోడీని ఓడించడానికి ప్రతిపక్షాలు అందరూ కలిసికట్టుగా ఉంటే చాలు.. అధికారం తమకు దక్కకపోయినా పరవాలేదు అనే త్యాగభావం కాంగ్రెసులో ఏర్పడిందా అనే అభిప్రాయం పలువురికి కలుగుతుంది.
అదే సమయంలో, మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి కూడా తాము మరింతగా బలపడడానికి పావులు కలుపుతోంది. తమ కూటమి నుంచి రకరకాల భేదాభిప్రాయాల వల్ల గతంలో బయటకు వెళ్లిన పాత మిత్రులను కూడా తిరిగి ఆహ్వానిస్తూ తాజాగా ఢిల్లీలో భేటీ నిర్వహించింది. ఆ కూటమి కూడా ప్రస్తుతం ఉన్న దాని కంటే ఎక్కువగా బలపడే దిశగా దృష్టి సారించిన సంగతి స్పష్టం. ఇలాంటి పరిణామాలను గమనించి వివక్ష కూటమి అధికారంలోకి రావడం కష్టం అనే భావనతో కాంగ్రెస్ పార్టీ త్యాగమూర్తి నాటకం ఆడుతున్నదా అని కొందరు అనుమానిస్తున్నారు.
విపక్షాలు గెలిచే అవకాశం తక్కువగా ఉన్నదనే అభిప్రాయంతో, పిరికితనంతో.. ముందుగానే చేతులెత్తేసి తమకు ప్రధాని పదవి అక్కర్లేదంటున్నారని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది వారిలోని పిరికితనానికి నిదర్శనం అని కొందరు అంటున్నారు. ఇలాంటి మాటలు కూటమి నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఇలా ఒకటి కంటే ఎక్కువ మంది ప్రధాని పదవి మీద ఆశపడుతూ జట్టు కట్టినప్పుడు.. ప్రధాని పదవి అనేది ఎన్నికల తర్వాత మా జట్టు తీసుకునే నిర్ణయం అనే ప్రకటన మాత్రమే వస్తుంది. విపక్ష కూటమి విషయంలో అలా కాకుండా, మాకు మాకు అక్కర్లేదు అని కాంగ్రెస్ చెప్పడం సందేహాలను రేకెత్తిస్తోంది. వీటిని నివృత్తి చేయడానికి ఆ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.