తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేక రూపాలుగా మారనున్న రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతున్నాయా? ఈ రాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని మూడు పార్టీలు సమానంగా దృష్టి పెడుతున్న వేళ.. జంపింగ్ జపాంగ్ లకు రాబోయే రోజుల్లో చేతినిండా పని ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత.. కాంగ్రెస్ కు తెలంగాణ లో కూడా కాస్త క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పార్టీని వదిలించుకోవాలని అనుకుంటున్న నాయకులు.. కాంగ్రెస్ వైపు చూసే వాతావరణం కనిపిస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ వెలుగులు పెరిగే కొద్దీ.. చేరికలు ఇంకా ఎక్కువ అవుతాయని, కమలం పార్టీకి కూడా దెబ్బ తప్పదని, బిజెపి నుంచి కాంగ్రెస్ లో కి వలసలు వచ్చినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల మీద చాలా పట్టుదలగా ఉంది. ఇంకా ఎన్నికల సీజను మొదలు కాకముందే నెలరోజుల వ్యవధిలో ముగ్గురు కేంద్ర కీలక నేతల భారీ బహిరంగ సభలను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్నారు. అమిత్ షా, జెపినడ్డా, నరేంద్రమోడీ ఆ సభల్లో పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో బిజెపికి ఉన్న బలం తక్కువ అయినా సరే.. అక్కడే ఆర్భాటంగా సభ నిర్వహించి తమ సత్తా ఉన్నట్టుగా చూపించుకోవాలని అమిత్ షా వస్తున్నారు.
అయితే కాంగ్రెస్ ఇంకాస్త బలంగా తయారైందంటే మాత్రం బిజెపిలోకి వచ్చిన వలసనేతలు పలువురు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నదనేది ఒక అంచనా. ఈటల రాజేందర్ కమలదళంలో ఇమడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖమ్మంలో తమ పార్టీకి బలం లేదని ఆయన స్వయంగా ఇటీవల ప్రకటించారు కూడా. అదే సమయంలో డికె అరుణ గురించి కూడా రకరకాల పుకార్లు వచ్చాయి. ఆమె స్వయంగా వీటిని ఖండించాల్సి వచ్చింది. తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిస్థితి కూడా డౌటుగానే ఉంది. ఆయన ఇటీవలి కాలంలోనే బిజెపిలోకి వచ్చారు. తిరిగి కాంగ్రెసులోకి వెళ్లవచ్చుననే వాదన వినిపిస్తోంది.
కొండా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లకు పార్టీలు ముఖ్యం కాదు. కేసీఆర్ ను ఓడించడం ఒక్కటే వారికి కావాలి. ఆ మాత్రం సత్తా ఏ పార్టీలో కనిపిస్తే ఆ పార్టీలో వారు చేరుతారు. పొంగులేటి జూపల్లి ద్వయం ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్లను బిజెపి మాయమాటలు చెప్పి తమతో చేర్చుకుంది. కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి వచ్చేది బిజెపి మాత్రమేనని, అది మిస్సయినా కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉంటుంది గనుక.. రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నమ్మించారు. అయితే కొండా లాంటి వాళ్లు కూడా బిజెపి మీద అపనమ్మకంతోనే ఉన్నారని.. పరిస్థితులను బట్టి పార్టీ వీడుతారని తెలుస్తోంది.
కాంగ్రెస్ ఇంకా వెలిగితే, కమలం వికెట్లు రాలుతాయా?
Wednesday, December 18, 2024