కాంగ్రెసు పార్టీలో చిత్రమైన రాజకీయం నడుస్తుంటుంది.. ఈ దేశప్రజలకు అలవాటు అయిపోయింది కూడా. కాంగ్రెసు పార్టీ మీద గుత్తపెత్తనాన్ని, సర్వాధికారాలను తనచేతిలో పెట్టుకుని సోనియా కుటుంబం పగ్గాలు పట్టుకునే రౌతులను మాత్రం మారుస్తుంటుంది. ఈ పార్టీ మొత్తం రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలంటూ.. గగ్గోలు పెడతారు. ఆయనమాత్రం నాకు అధ్యక్ష పీఠం వద్దంటే వద్దంటూ త్యాగం ప్రదర్శిస్తారు. ఈ డ్రామా ప్రతిసారీ నడుస్తుంటుంది. మొత్తానికి ఇప్పటికీ పెత్తనం రాహుల్ చేతిలో ఉన్నప్పటికీ.. అధ్యక్షుడు అనే హోదా మల్లికార్జున ఖర్గే కు దక్కింది.
అదే కాంగ్రెసు పార్టీ తాను నుంచి చిరిగిన ముక్కగా పుట్టి, ఎదిగి వర్ధిల్లుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవహార సరళి కూడా అదే మాదిరిగా కనిపిస్తోంది. ఎన్సీపీని ప్రారంభించిన నాటినుంచి శరద్ పవార్ దానికి సారథి. ఆయన వయసు ఇప్పుడు 82 ఏళ్లు. అనుభవం పుష్కలంగా ఉన్నది గానీ.. ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. ఇలాంటి సమయంలో ఆయన పార్టీ సారథ్య బాధ్యతలనుంచి తప్పుకోవాలని ఆశించడం పెద్ద విశేషం కాదు. ఎన్నికల్లో పోటీచేయను గానీ.. రాజకీయంగా క్రియాశీలంగానే ఉంటాను అని హామీ ఇస్తూనే, అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటూ ఆయన రాజీనామా చేస్తే.. పార్టీ వారు దానిని ఒప్పుకోవడం లేదు. రెండు మూడురోజుల హైడ్రామా తర్వాత పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా.. ఆయన పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవడానికి వీల్లేదంటూ తీర్మానం చేసేశారు. వీరి తీర్మానం పట్ల ఆయన ఎలా స్పందిస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే శరద్ పవార్ రాజీనామా పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. తన సారథ్యంలో పార్టీ కమలదళంతో చేతులు కలపడం ఇష్టం లేకనే.. ఆయన వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. గతంలోనే బిజెపితో చేతులు కలిపి ఆయన అన్న కొడుకు, పార్టీలో కీలక నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్రకు డిప్యూటీ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ ప్రభుత్వం కూలింది. ఇప్పుడు చేతులు కలిపితే.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కుతుందనే ఆఫర్ ఆయనకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీని చీల్చకుండా, అలాగని బిజెపితో నెయ్యం వల్ల వచ్చే అవకాశాలను వదలుకోకుండా ఉండడానికే పవార్ తప్పుకున్నట్టు గుసగుసలున్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు, జాతీయ రాజకీయాలు కూతురు సుప్రియ చేతిలోపెట్టి, రాష్ట్ర రాజకీయాల్ని అజిత్ చేతిలో పెట్టాలని ఆయన అనుకున్నట్టు వార్తలు వచ్చాయి గానీ, తాజాగా పార్టీ అంతా కలిసి ఆయన రాజీనామాను తిరస్కరించిన నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
కాంగ్రెసు కంటె కామెడీగా వీరి రాజకీయం!
Wednesday, January 22, 2025