కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చాలా పెద్దస్థాయిలోనే దీక్షకు పూనుకుంటున్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో కేసీఆర్ తీరు ఎంత ఘనంగా ఉన్నదనే ప్రశ్నకు ఆమె ఏం జవాబు చెప్పగలరో దేవడి కెరుక! కానీ, దేశంలో 29 రాష్ట్రాలనుంచి మహిళా సంఘాలను ఆహ్వానించారట. 18 పార్టీలు తమ ప్రతినిధులను పంపడానికి ఒప్పుకున్నాయట. కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించారట. ఈ రకంగా మొత్తంగా చాలా పెద్ద కార్యక్రమంగా చేయదలచుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నాకు అనుమతి చాలా హైడ్రామా మధ్య లభించింది. తొలుత అనుమతి రద్దు అని, తర్వాత పాక్షికం అని చివరికి ఓకే చెప్పారు.
ఇకపోతే.. ఈ ధర్నా ద్వారా కవిత ఏం సాధించబోతున్నారు. మహిళా బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే లోక్ సభలో పెట్టాలనేది ఆమె డిమాండ్. అంతవరకు బాగానే ఉంది. ఈ బిల్లు ప్రవేశపెడితే.. తన ధర్నాకు హాజరవుతున్న 18 పార్టీలు అనుకూలంగా లోక్ సభలో బేషరతుగా వ్యవహరించేలా కవిత పూచీ తీసుకుంటారా? తమ పార్టీ ఆఫీసు ప్రారంభానికి సైతం అతిథిగా వచ్చే సమాజ్ వాదీ అఖిలేష్ తరఫున కూడా బిల్లుకు మద్దతు బేషరతుగా ఇప్పించగలరా? ఇలాంటి ప్రశ్నలకు ఆమె ఒక్క జవాబు కూడా చెప్పలేరు.
ఈ ధర్నా ద్వారా.. బిజెపి సర్కారు మీద నిందలు వేయగలరు తప్ప ఆమె సాధించేదేమీ ఉండదు. ఈ దీక్షకు ముడిపెట్టి.. తాను బిజెపి సర్కారు లోపాలను, మహిళల పట్ల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పోరాటాలు చేస్తున్నాను గనుక తన మీద కక్ష కట్టి తనను అరెస్టు చేశారని, అరెస్టు కోసం కేసుల్లో ఇరికించారని అదనంగా నిందవేయడానికి మాత్రమే ఈ దీక్ష ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఆమె సాధించేది తక్కువ. ఈమె దీక్షతో మహిళా బిల్లుకు మోక్షం రాదు. ఒకవేళ బిల్లు సభలో ప్రవేశపెట్టినా కూడా గట్టెక్కుతుందనే నమ్మకం లేదు. ఆ సంగతి అంతా పక్కన పెడితే.. ఈ పోరాటం చేసినంత మాత్రాన.. కవితగానీ, భారాస గానీ మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారనే నమ్మకాన్ని సంపాదించుకోవడం కూడా కష్టం.
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. కర్నాటక ఎన్నికలపై కూడా భారాసకు ఆశ ఉంది. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఈ రాష్ట్రాల ఎన్నికల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తే.. తమ పార్టీ తరఫున అందరికంటె ముందుగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని నిరూపించుకుంటే అప్పుడు కవిత దీక్షను జనం నమ్ముతారు. అప్పటిదాకా.. ఆమెకు బిజెపిపై నిందలు వేయడానికి తప్ప ఈ దీక్ష మరెందుకూ ఉపయోగపడదు.
కవిత దీక్ష : నిందలు వేయొచ్చు.. నమ్మకం పెంచుకోలేరు!
Saturday, November 9, 2024