కల్వకుంట్ల వారి కులప్రీతికి హైకోర్టు చెక్!

Wednesday, September 18, 2024

ఇవాళ రాజకీయం మొత్తం కులాల మీదనే నడుస్తోంది. కులాల వారీగా ప్రజలను చీలిస్తే చాలు, ఒక్కొక్క కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వరాలను కురిపిస్తూ పోతే చాలు.. అంతకుమించి ఎన్నికలలో నెగ్గడానికి మరే ఇతర తారక మంత్రం అవసరం లేదు అనే సిద్ధాంతాన్ని అనువర్తించుకుంటూ నేటితరం రాజకీయ నాయకులు అడ్డగోలుగా చెలరేగుతున్నారు. కులాల ప్రాతిపదికగానే మాట్లాడుతున్నారు. కులాల ప్రాతిపదికగానే సంక్షేమాన్ని ప్రకటిస్తున్నారు. కులం ముసుగులోనే బలసమీకరణలు చేసుకుంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవహార సరళి ఇందుకు భిన్నమైనది ఎంత మాత్రమూ కాదు! ఆయన తన సొంత కులానికి మాత్రం మేలు చేసుకుంటే జనం నవ్విపోతారేమో అనే సంశయంతో వెలమ కులస్తులతో పాటు, కమ్మ కులస్తులకు కూడా అనుచిత లబ్ధిదారుల లిస్టులో చేర్చుకున్నారు. వెలమ, కమ్మ కులాల సంఘాలకు ఖానామెట్ పంచాయతీలో ఐదేసి ఎకరాల వంతున కెసిఆర్ కేటాయించడం విశేషం. హైదరాబాదు నగరంలో ఐటీ పరిశ్రమ విరాజిల్లిన ప్రాంతంలో ఒక్కొక్క ఎకరా భూమి పదులకోట్ల విలువ చేస్తుంటుంది. అలాంటిది కేసీఆర్ తన కులప్రీతిని చాటుకుంటూ.. ఆ రెండు కులాల వారికి ఐదేసి ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది సహజంగానే వివాదాస్పదం అయింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ వేశారు.

ఈ పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. కులరాజకీయాలు నడిపి.. కులాల పునాదుల మీద లబ్ధి పొందాలని అనుకునే రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటివి. ‘‘ఉన్న భూమిని పంచుతూ పోతే ఎలా? నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో అంటూ తమ జేబులో నుంచి తీసి ఇచ్చినట్లుగా ఎలా ఇచ్చేస్తారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజానికి హైకోర్టు వ్యాఖ్యలు- ప్రభుత్వాలు తమ సొంత సొమ్ములాగా భూముల్ని పంచేస్తున్నాయనే విపక్షాల విమర్శలకు దగ్గరగా ఉండడం విశేషం. ఈ తరహాలో భూములు కేటాయించడం అనేది సుప్రీంయ, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని ఇలాంటి కేటాయింపులు ఒకరకంగా భూకబ్జా కిందికి వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేటాయింపులను నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆ కుల సంఘాలు ఏమైనా నిర్మాణాలు ప్రారంభించి ఉంటే వాటిని కొనసాగించకూడదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వాల వైఖరిని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. కులాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, కులాలకు తాయిలాలు పెడితే చాలు, ఆయా కులాలను ఓట్లను గంపగుత్తగా దండుకోవడానికి కుల నాయకులను లోబరచుకుంటే చాలు.. అనే తరహాలో నాయకులు ముందుకు సాగుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం మిగిలిన కులాలకు కూడా అనేక వరాలు కురిపిస్తూ భూకేటాయింపుల గురించి వాగ్దానాలు ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఒక్కొక్క కుల ప్రాతిపదిక మీద భూములను పంచుకుంటూ పోవడం విజ్ఞత అనిపించుకోదు. వ్యక్తులు, కులాలు వెనుకబడి ఉంటే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు పని చేయాలి తప్ప కుల సంఘం అనే పేరు మీద ఆర్థికంగా సుసంపన్నంగా ఉండే సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles