‘కలసిమెలసి’ అనేపదం వారి డిక్షనరీలో ఉందా?

Friday, November 22, 2024

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దింపుడుకళ్లెం ఆశలతో.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలమని అనుకుంటోంది. ఆశపడడంలో తప్పులేదు. బిజెపితో పోల్చినప్పుడు.. తెకాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్నారు. కేవలం కేడర్ ఉన్నంత మాత్రాన వారు నెగ్గి అధికారంలోకి వచ్చేస్తారని అనుకోవచ్చా? అంటే ఎవ్వరూ ఏకపక్షంగా చెప్పలేని పరిస్థితి. హైదరాబాదు గాంధీభవన్లో తాజాగా రేవంత్ రెడ్డి సారథ్యంలో పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాటల్లోమెలిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అపురూపమైన విజయం.. దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీకి ఎంతో జోష్ అందించిందనడంలో సందేహం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ లో ఎలాంటి కొత్త జవజీవాలు కనిపించడం లేదు. రాష్ట్రవిభజన తర్వాత.. కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా సమాధి అయిపోయింది. నాయకులు పార్టీ కార్యవర్గంలోని పదవులకోసం కొట్టుకుంటున్నారే తప్ప.. పార్టీని బతికించడం గురించి పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. వారు శ్రద్ధ పెట్టినంత మాత్రాన బతికి బట్టకట్టే పరిస్థితి కూడా లేదు.
అయితే తెలంగాణలో పరిస్థితి వేరు. కాంగ్రెస్ చాలా గట్టిగా ఈసారి అధికారంలోకి రావాలని తలపడుతోంది. కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత తమకు లాభిస్తుందని కలగంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని ఆయన పార్టీ సమావేశంలో అంటున్నారు. అలాంటి మాటలు పార్టీ నాయకులకు స్ఫూర్తిని ఇస్తాయి. అయితే.. ఇందులో ఆయన ఒక మెలిక పెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసిమెలిసి కృషిచేస్తే’ గెలుస్తామన్నారు.
టీకాంగ్రెస్ నాయకులకు సంబంధించినంత వరకు ‘కలిసి మెలిసి’ అనే పదం వారి డిక్షనరీలో ఉన్నదా? అనేది ప్రజల సందేహం. ఎందుకంటే.. ఇక్కడ ఉన్నన్ని ముఠా తగాదాలు కాంగ్రెస్ పార్టీలో కూడా మరే ఇతర రాష్ట్రంలోనూ ఉండవు. కర్ణాటకలో పార్టీ విజయం సాధించిందంటే.. అదేమీ ఆషామాషీగా దక్కలేదు. పార్టీ మొత్తం ఏకతాటి మీద ఉంది. తీరా అంత ఘనమైన మెజారిటీతో పార్టీ గెలిచిన తర్వాత కూడా.. కొంత వరకు పంతాలకు పోయినా.. ఎలాంటి విభేదాలు లేకుండా ముఖ్యమంత్రి ఎంపిక జరిగింది. అంతటి ఐక్యత టీకాంగ్రెస్ లో ఉన్నదా? అనేది సందేహం.
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఏ యాత్రతో ఎవరికి మైలేజీ వచ్చేస్తుందో అనే భయంతో.. నాయకులు ఎవరికి వారు తమ తమ పరిధిలో పాదయాత్రలు చేస్తున్నారు. అంతటితో వదిలేయలేం. ఇతర నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇతర సొంత పార్టీ నాయకుల వెనుక గోతులు తవ్వుతున్నారు. పార్టీ గెలిచే సంకేతాలు కనిపిస్తే చాలు.. ముఖ్యమంత్రిని నేనంటే నేనేనని… రోడ్డున పడి కొట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ముఠా కక్షలకు ఇంతటి నిలయమైన టీకాంగ్రెస్ కలిసి మెలిసి ఎన్నికలలో పనిచేయడం సాధ్యమేనా? పార్టీకోసం ఎన్ని మెట్లు అయినా దిగుతానని ఆర్భాటంగా చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఈ ఐక్యత కోసం తన వంతు ప్రయత్నం చేయగలరా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles