రాజకీయ నాయకులు ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బతీయడానికి, వారి మీద ప్రజల్లో దురభిప్రాయం కలిగించడానికి నానా పాట్లు పడుతుంటారు. నానా అబద్ధాలను ప్రచారంలో పెడుతుంటారు. ఇలాంటి రాజకీయ విష ప్రచారాల్లో చాలా వరకు అనైతికమైన విమర్శలే ఉంటూ ఉంటాయి. చంద్రబాబునాయుడు గురించి ప్రచారం చేయడానికి కొన్ని సంవత్సరాలుగా ఎంచుకున్న అనైతికమైన ప్రచారం.. కరవుతో ముడి ఉందనడం.
రాజకీయ నాయకులకు చేతనైతే ప్రత్యర్థుల రాజకీయ విధానాలను, సిద్ధాంతాలను విమర్శించాలి. వారు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలను విమర్శించాలి. వారి పాలనను విమర్శించాలి. అలాంటివేమీ లేనప్పుడు.. ఏవో ఒక పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి.. దాన్నే పదేపదే అంటూ జీవితాంతం బతికేయవచ్చునని అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన తెనాలి సభలో చంద్రబాబునాయుడు గురించి చేసిన విమర్శలు కూడా అలాగే ఉన్నాయి.
చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే వర్షాలు కురవవు అని, పంటలు పండవు అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కొన్ని సంవత్సరాలుగా కువిమర్శలు చేస్తూనే ఉన్నారు. తమాషా ఏమిటంటే. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నానని, ప్రజలందరూ తనకు నీరాజనాలు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను అనూహ్యమైన మెజారిటీతో గెలిపిస్తారని పదేపదే ప్రగల్భాలు పలుకుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు గురించి ఇప్పటికీ అదే పాచిపోయిన విమర్శలను పట్టుకుని వేళ్లాడుతున్నారు. చంద్రబాబుకు కరవుతో ఫ్రెండ్షిప్ అని.. ఆయన అధికారంలోకి వస్తే వర్షాలు పడవని, తమ పాలనకు వరుణదేవుడి కరుణ ఉన్నదని ఆయన తనదైన సొంత భాష్యాలు చెబుతున్నారు.
చంద్రబాబునాయుడు పట్ల ప్రజలలో విముఖత నిర్మించడానికి.. ఆయన వస్తే కరువు వస్తుంది.. అనే చెత్త మూఢనమ్మకాల డైలాగులు తప్ప మరో ఎజెండా అంశం ఏదీ జగన్ వద్ద లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. చంద్రబాబునాయుడు విధానాలను విమర్శించలేని స్థితిలో జగన్ ఉన్నారేమో అనే సానుభూతి కలుగుతోంది. సంక్షేమం గెలిపిస్తుందని అనే వ్యక్తి.. చంద్రబాబు పట్ల ప్రజల్లో భయం పుట్టించడానికి ఇలాంటి అనైతిక విమర్శలకు ఎందుకు దిగుతున్నట్టు? ఇంకో రకంగా చేతకాక.. ఇలాంటి సెటైరికల్ మాటలతో జీవితమంతా గడిపేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నదా? అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
జగన్ తన పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేలా మాట్లాడాలి.. లేదా, ప్రత్యర్థి అసమర్థతలు తెలియజెప్పేలా మాట్లాడాలి.. అటూఇటూ కాకుండా ఇలాంటి విమర్శలు తగ్గించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
‘కరవుతో చంద్రబాబుకు ముడి’.. జగన్ జీవితమంతా ఇదేనా?
Wednesday, January 22, 2025