కరణంతో కన్ఫర్మ్ చేయిస్తారా… ప్లీజ్!

Saturday, September 7, 2024

రాజకీయాలలో తమ ప్రత్యర్థులను బదనాం చేయడానికి బురద చల్లడం, నిప్పులు చెరగడం మాత్రమే కాదు. నాయకులకు వీలైతే అంతకంటే ఎక్కువగా ఏమైనా చేయగలరు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు రౌడీ అని, గూండా అని అల్లర్లకు ప్రధాన కారకుడని ఆరోపిస్తున్నారు. పుంగనూరులో అల్లర్లు అనేవి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య చిరకాల వైరానికి ప్రతీకగా, వైసీపీ కవ్వింపుతో జరిగినవి. కాబట్టి, పార్టీలో గాని ప్రభుత్వంలో గాని జగన్ తర్వాత అంతటి కీలకమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ని తిట్టిపోయడానికి అందరూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ మూలాల్లో తెలుగుదేశం అనుబంధం కలిగి ఉన్న కొందరు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తొలి నుంచి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధ్వంసకర ఆలోచనల పుట్ట అనేతరహాలో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకు గురైన సందర్భంలో తాను తెలుగుదేశం లోనే నెల్లూరు జిల్లా పార్టీ సారధ్య బాధ్యతలు చూస్తున్నానని అప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా తనకు ఫోన్ చేశారని అన్నారు. తనకు, ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి కి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి పరిటాల రవి హత్యకు గురైన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయాలని, ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను తగలబెట్టించాలని పురమాయించినట్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తరహానే అంత అని ప్రభుత్వాస్తుల దహనాలు, విధ్వంసం ఆయన రాజకీయం అని నింద వేశారు.

పుంగనూరు సమీపంలో అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణలు, అల్లర్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు గురించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఈ సరికొత్త ఆరోపణ చాలా తీవ్రమైనది. నోరు ఉన్నది కదా అని కేవలం ఒక మాట వదిలి, బురద చల్లేసి ఊరుకుంటే సరిపోదు. ఎందుకంటే తాను నెల్లూరు జిల్లా పార్టీ సారథ్యం చూస్తున్న రోజుల్లోనే చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బస్సులు తగలబెట్టమన్నారు అని ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నాయకుడు చెప్పారంటే కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అదే సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ ప్రీతి కోసం ఇలాంటి తీవ్రమైన నిందలు వేస్తున్నారా? లేదా, ఇవన్నీ నిజమేనా? అని కూడా ఆలోచించాల్సి ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలను ఏకపక్షంగా నమ్మడానికి వీల్లేదు. అయినా అప్పటి ఒంగోలు జిల్లా ఇన్చార్జి కరణం బలరామకృష్ణమూర్తి పేరు కూడా చెబుతున్నారు కనుక.. కరణం ద్వారా కూడా ఈ నిందలను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నిజానికి కరణం బలరాం కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ పుంగనూరు అల్లర్ల నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు మీద వేసిన నింద నిజమేనని నిరూపించాలంటే కరణం బలరాం ద్వారా కూడా అదే విషయాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు గనుక అవకాశవాద ధోరణితో మాట్లాడే ప్రమాదం ఉంటుంది. పరిటాల రవి హత్యకు గురైన సమయానికి తెలుగుదేశంలో ఇతర జిల్లాలకు సారథ్యం వహిస్తున్న నాయకులూ కూడా అప్పట్లో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు వారందరికీ ఫోన్లు చేసి ఎలాంటి ఆందోళనలకు పురమాయించారో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం కరణం ద్వారా కూడా ఏ మాటలు చెప్పించ లేకపోతే కనుక వైసిపిలోని ప్రసన్నకుమార్ రెడ్డి అండ్ కో చంద్రబాబు మీద బురద చల్లేసి తద్వారా వీలైనంత అనుచిత లబ్ధి పొందాలని ఆశతో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles