ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తిరుగులేదు, తనను అడిగేవారు లేరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విర్రవీగుతూ ఉండడానికి ఏపీ బీజేపీ కూడా ఒక కారణం. ఆయన తరచుగా మోడీని కలిసినప్పుడెల్లా.. కాళ్లు మొక్కుతూ కానుకలు సమర్పించుకుంటూ.. ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు గనుక.. ఏపీ కమల దళపతులు కూడా తదనుగుణంగా.. ఆయన పట్ల సాఫ్ట్ వైఖరితో ఉంటారేమో అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. మరోవైపు.. ఏపీ బిజెపిలోని కొందరు కీలక నాయకులు వైసీపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతున్నారని.. వారు జగన్ పట్ల మెతకధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. సాక్షాత్తూ ఏపీ బీజేపీ కోర్ కమిటీతో విశాఖలో శుక్రవారం రాత్రి మోడీ నిర్వహించినకోర్ కమిటీ సమావేశంలోనే.. ఎమ్మెల్సీ ఒకరు బిజెపి, అధికార వైసీపీతో సన్నిహితంగా మెలగుతోందనే ప్రచారం జరుగుతోందని అన్నారంటే.. కొందరు నాయకుల అక్రమ సంబంధాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఈ కోర్ కమిటీతో భేటీలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన దిశానిర్దేశం ఏమిటో.. ఏపీలోని కమల దళపతులు తమ చెవుల తుప్పు వదిలించుకుని మరీ వినాలి. వినినప్పటికీ.. ఏమీ ఎరగనట్టుగా నటిస్తే.. ఊరుకునే ఘటం కాదు మోడీజీ!
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై చార్జిషీట్ తయారు చేయాలని మోడీ కోర్ కమిటీకి పిలుపు ఇచ్చారు. మండలస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు చార్జిషీట్లు రూపొందించి.. ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాల మీద సంతకాల సేకరణ చేయాలని కూడా సూచించారు. రాజకీయాల్లో అలసత్వం, నెమ్మదితనం పనికి రాదని, ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, వెనుకాడుతూ ఉంటే, వేగంగా ఉండకపోతే.. మరొకరు వచ్చి మన స్థానాన్ని ఆక్రమించేస్తారని మోడీ వారికి హితబోధ చేశారు.
మోడీ సూచన బాగానే ఉంది. కానీ అమలు చేసేది ఎవరు? సాక్షాత్తూరాష్ట్ర పార్టీకి సారథ్యం వహిస్తున్న సోము వీర్రాజు స్వయంగా జగన్ అనుకూలుడు అనే ముద్ర ఉంది. ఆయన సారథ్యంలో.. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు అనేవి ఊహించడం కూడా సాధ్యం కాదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. నిజానికి ఈ సమావేశంలో.. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి.. ఎన్ని మండలాలున్నాయి అని మోడీ స్వయంగా అడిగితే.. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాంటి నాయకుడిని రాష్ట్ర సారథి చేశామా? అని బహుశా మోడీ సిగ్గుపడి ఉంటారు కూడా!
మోడీ పర్యటన తర్వాత.. జగన్ ప్రభుత్వం మీద సమరం ప్రకటించే దిశగా రాష్ట్ర బిజెపిని ఉత్తేజితం చేస్తున్న క్రమంలో.. సోమువీర్రాజు పదవి ఊడుతుందనే ప్రచారం కూడా పార్టీలో మొదలైంది.