ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడపాదడపా విమర్శలు చేస్తున్నప్పటికీ.. మౌలికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తూ ఉంటుందనే ఆరోపణలు చాలాకాలంగా వినవస్తున్నాయి. ఏపీ బిజెపిలో కీలకంగా ఉండే కొందరు నాయకులు.. జగన్ తో కుమ్మక్కు అయి రాజకీయం నడిపిస్తున్నారనేది ఒక ఆరోపణ. అదే సమయంలో తమ భాగస్వామి పార్టీ అయిన జనసేన పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమాల్లో పోరాటాల్లో క్రియాశీల పాత్ర పోషించకపోవడం కూడా అందుకే అనేది మరో ఆరోపణ. ‘పవన్ కల్యాణ్ తో మా బంధం కొనసాగుతూ ఉంది.. మారెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీచేస్తాయి’ అని బిజెపి నేతలు పదేపదే చెప్పడం కూడా.. పవన్ ను బాబుతో కలవకుండా అడ్డుకోడానికే తప్ప మరొకందుకు కాదని అనేవారు కూడా ఉన్నారు. ఇలాంటి రకరకాల విమర్శలున్న నేపథ్యంలో కమలదళం అసలు బుద్ధి ఏమిటి? వైఖరి ఏమిటి? నిజాయితీగానే ఉన్నారా? లేదా, జగన్ తో కుమ్మక్కు బాటలోనే ముందుకు సాగతారా? అనేది ఇప్పుడు తేలిపోనుంది. జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరంలో తీసుకువచ్చిన జీవో నెం.1 మీద రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజాసంఘాలు ఒక్కటై ఉద్యమానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ఇదే జీవోపై విమర్శలు మాత్రం చేసిఊరుకున్న బిజెపి, ఐక్యఉద్యమ కార్యాచరణలోకి వస్తుందా? లేదా? అనేదాన్ని బట్టి తేలిపోనున్నది.
భారతీయ జనతాపార్టీ అధిష్ఠానానికి ఏపీ రాజకీయాలపై ఫోకస్ లేదు. వారికి ఉన్నదెల్లా ఒక్కశాతం ఓటు బ్యాంకే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన లోకల్ లీడర్లు గనుక.. కాస్త హడావుడి చేస్తుంటారు తప్ప.. లేకపోతే సోదిలోకి నిలబడే పార్టీ కాదు. ఇక్కడ ఎటూ సీట్లు గెలిచే సత్తా లేదు గనుక, రాజకీయం ఎటుపోయినా వారికి పర్లేదు. జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ముద్రపడిన బిజెపి నాయకులు, దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై విషం చిమ్ముతుంటారు. అయితే.. ఇప్పుడు జీవో నెం.1 అనేది పార్టీ రహితంగా.. విపక్షాలకు చెందిన అందరి పీకనొక్కే వ్యవహారం కావడంతో.. బిజెపి స్పందన ఎలా ఉంటుందనేది కీలకం కానుంది.
వామపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి.పౌరసంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. బిజెపిలో మాత్రం ఇప్పటిదాకా కదలిక లేదు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి.. పొత్తులు ప్రకటించకపోయినా.. ఐక్యకార్యచరణగా చేయబోతున్న పోరాట ప్రయత్నానికి వామపక్షాలు కూడా అండగా నిలవబోతున్నాయి. ఇందరు ఏకం అవుతున్నప్పటికీ.. భాజపాలో కదలిక రావడం లేదు. వారి అసలు బుద్ధి ఏమిటో ఇప్పుడు బయటపడుతుందని అందరూ అనుకుంటున్నారు. జగన్ ను నొప్పించకుండా.. ‘తాము ఒంటరిగానే జీవో నెం.1 పై పోరాడుతామని, ఇతరుల వ్యూహంలో పావులు కాబోమని’ ప్రకటిస్తారా? లేదా, జగన్ సర్కారు పతనాన్ని నిర్దేశించేలా.. ఐక్యపోరాటంలో కదం కలుపుతారా? అనేది వేచిచూడాలి.
కమలదళం బుద్ధి ఏంటో బయటపడుతుంది!
Wednesday, January 22, 2025