ఒకవైపు రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతున్నదని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే గనుక.. ఇక కాపాడుకోడానికి రాష్ట్రం కూడా మిగిలి ఉండదని జనసేనాని పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా చెబుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను గెలవ నివ్వకూడదని, అందుకోసం విపక్షాలందరూ కూడా కలిసి పోటీచేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అంటుంటారు. అయితే అదే సమయంలో.. ఆయనతో పొత్తుల్లో ఉన్న బిజెపి నాయకులు కొందరు.. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు ఏర్పడడానికి వీల్లేదు. వ్యతిరేక ఓటు ఖచ్చితంగా చీలవలసిందే.. జగన్మోహన్ రెడ్డికి ఆ మేరకు లబ్ధి చేకూరవలసిందే.. ఆయన మళ్లీ అధికారంలోకి రావాల్సిందే అనే రహస్య ఎజెండాతో పనిచేస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యుడు.. భాజపా ఎంపీ జివిఎల్ నరసింహారావు.
తాజాగా ఆయన విశాఖలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎడాపెడా కబ్జాలకు గురవుతోంటే.. వైసీపీ నాయకులు అత్యంత అడ్డగోలు రీతిలో ఆ భూములను కాజేస్తోంటే.. అందాల రుషికొండను సర్వనాశనం చేసేస్తోంటే.. అలాంటి ఏ వ్యవహారం మీద కూడా నోరు మెదపని జీవీఎల్ నరసింహారావు.. అసలు విశాఖలో భూ కుంభకోణాల మీద తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు కలిసి చర్చకు రావాలని పిలుపు ఇవ్వడం తమాషా.
రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అంటున్నారు. భాజపా జనసేనలు మాత్రమే ప్రత్యామ్నాయం అవుతాయంటున్నారు. ఈ కోరికకు ‘భవిష్యత్తులో’ అనే పదాన్ని యాడ్ చేయడం ద్వారా.. 2024లో జరగబోయే ఎన్నికల్లో తాము గెలవబోమనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్ మాటలు ఎలా ఉన్నాయంటే.. ‘‘మేం గెలవం.. పవన్ కల్యాణ్ ను కూడా గెలవనివ్వం’’ అన్నట్టుగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ తో జట్టు కట్టినట్టుగా బిల్డప్ ఇస్తూ.. పవన్ కల్యాణ్ ముందరి కాళ్లకు బంధాలు వేసే తరహాలో జీవీఎల్ మాటలు సాగుతున్నాయి.
జీవీఎల్ నరసింహారావుకు.. కమలదళంలో ఉన్న జగన్ ఏజెంటు అనే ముద్ర చాలాకాలంగా ఉంది. తిరుపతిలో పార్టీ సమీక్ష సమావేశం జరిగినప్పుడు.. జీవీఎల్ అమరావతి విషయంలో తన వాదన చెప్పబోయినప్పుడు.. పార్టీలో ఎవరెవరు జగన్ కు ఏజంట్లుగా పనిచేస్తున్నారో నాకు తెలుసునని అమిత్ షా చాలా సీరియస్ గా వ్యాఖ్యానించడం కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన సంగతి. మోడీ ఏపీకి వచ్చి, జగన్ ప్రభుత్వం మీద చార్జిషీట్ తయారు చేయాలని పార్టీకి హితోపదేశం చేసి వెళ్లినా కూడా.. ఆ పార్టీలోని జగన్ ఏజంట్లు.. ఇంకా తమ తీరు మార్చుకోలేదు. తమ ప్రతిమాట, ప్రతి పని జగన్ సంక్షేమం కోసమే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
కమలదళంలో జగన్ ఏజంట్ల కోరిక అదే!
Sunday, December 22, 2024