ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీలో చేరారు. తన జీవితంలో కాంగ్రెసును వీడవలసిన అవసరం ఏర్పడుతుందని ఎన్నడు అనుకోలేదని, కానీ ఆ పార్టీ వ్యవహారసరళి పూర్తిగా మారిపోయినందువలన వీడవలసి వచ్చిందని ఆయన ప్రకటించారు. నిజానికి కాంగ్రెసుతో కిరణ్ బంధం 10 ఏళ్ల కిందటే పుటుక్కుమన్నది. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తరఫున తీర్మానం చేసినప్పుడే ఆయన కాంగ్రెస్లో తిరుగుబాటు నాయకుడు కింద లెక్క. విభజన జరిగిన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను గురించిన మాటలు చెప్పడంలో అర్థం లేదు. జై సమైక్యాంద్ర షో డౌన్ అయిన తర్వాత తిరిగి ఆయన కాంగ్రెస్ పంచన చేరినప్పటికీ.. ఇన్నాళ్లు స్తబ్దంగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు గాని, తనకు వేరే గత్యంతరంగానీ లేదని అర్థం అయిన తర్వాత బిజెపిలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని భారతీయ జనతా పార్టీకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక అనేది ఒక గుదిబండ లాంటి వ్యవహారం అని పలువురు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వలసలు వచ్చిన వారితో సహా కమల నాయకుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. వీరందరికీ పదవులు పంచడమే పార్టీకి కష్టంగా కూడా ఉంది. రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనూ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఉన్న నాయకులు అందరికీ కేంద్ర నామినేటెడ్ పదవుల లోనే న్యాయం చేయాల్సిన ఖర్మ ఉంది. ఈ పరిస్థితుల్లో అదనంగా ఒక కొత్త సీనియర్ నాయకుడిని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం అవసరమా అనే అభిప్రాయాలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.
సాధారణంగా పనిచేసిన సీనియర్ నాయకులు పార్టీలో చేరేటప్పుడు వాతావరణం ఇంకో రకంగా ఉంటుంది. జాతీయ అధ్యక్షుడు సమక్షంలో చేరిన సరే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా అక్కడ ఉండడం రివాజు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సమయంలో అక్కడ సోము వీర్రాజు లేరు. రాష్ట్ర నాయకులలో విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఆయనతోపాటు ఉన్నారు. తద్వారా ఏపీ బీజేపీలో రెడ్డి సామాజిక వర్గం ఒక ముఠాగా ఏర్పడడానికి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక ఒక కారణం అవుతుందా అని కొందరు విశ్లేషిస్తున్నారు.
కిరణ్ చేరడం వలన బిజెపి ఓటు బ్యాంకు ఎంత మెరుగుపడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తమ పార్టీలోకి వచ్చినందువలన ఇంకా ఎంతమంది నాయకుల వలసలు తమ పార్టీకి కలిసి వస్తాయో కూడా బిజెపికి క్లారిటీ లేదు. కానీ కిరణ్ మాత్రం రాజ్యసభ సభ్యత్వం ఆశించి కమలం నీడకు వెళ్ళినట్లుగా పుకార్లు వినవస్తున్నాయి. ఉన్న నాయకులకే పదవులు పంచలేక కొట్టుమిట్టాడుతున్న బిజెపి కొత్తగా వచ్చిన కిరణ్ కు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అంటే ఆ పార్టీకి ఆయన తెల్ల ఏనుగు లాగా భారంగా మారుతున్నట్టే లెక్క.