కమలం : మిత్రులనైనా కాటు వేయకుండా వదలదు!

Wednesday, January 22, 2025

నైతికత లేని భాజపా ఫిరాయింపు రాజకీయాలు.. భారత దేశానికి కొత్త కొత్త అనుభవాలను రుచి చూపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో ఎమ్మెల్యేకు ఎర కేసులో పరువు పోగొట్టుకున్న భారతీయ జనతా పార్టీ మరోవైపు మేఘాలయలో అధికారంలో ఉన్న తమ మిత్రపక్షానికే షాక్ ఇచ్చింది. వారి పార్టీనుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను తమతో కలిపేసుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి రావాలని బిజెపి కలలు కంటోంది. 

వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తమకు మూడే సీట్ల బలం ఉండగా.. ఎన్పీపీ నుంచి ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంటు ఒకరిని తమలో కలిపేసుకుంది. దీంతో బిజెపి బలం 7 స్థానాలకు పెరుగుతుంది. ఇంకో నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకోగలిగితే గనుక.. అధికార ఎన్పీపీని కూలదోసి , ఆ కూటమిలోని మిగలిన పార్టీలతో కలిపి బిజెపినే సర్కారు ఏర్పాటుచేసే అవకాశమూ ఉంటుంది. అలా మరో అయిదుగురు ఎమ్మెల్యేలు రావడం జరిగితే.. అధికార కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ బిజెపినే అవుతుంది. ఎన్పీపీని పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవడం వారికి సాధ్యం అవుతుంది. 

తమాషా ఏంటంటే.. ఇప్పుడు తృణమూల్, ఎన్పీపీల నుంచి ముగ్గురు ఫిరాయించి బిజెపి జట్టులోకి చేరినప్పటికీ.. కండువాలు కప్పుకున్నప్పటికీ.. స్పీకరు వారి మీద వేటు వేస్తారని అనుకోవడం భ్రమే. ఎందుకంటే ఆయన నష్టపోయిన ఎన్పీపీ పార్టీ వ్యక్తి కాదు. యూడీపీ కి చెందిన ఎమ్మెల్యే. ఆ నేపథ్యంలో..మరికొన్ని ఫిరాయింపులు జరిగినా కూడా అనర్హత వేటు అంత సులువుగా పడకపోవచ్చు. 

మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు కావాలి. భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో దక్కినది కేవలం 2 సీట్లు మాత్రమే. తర్వాత ఆ బలాన్ని మూడు సీట్లకు పెంచుకుంది. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. వారికి ప్రస్తుతం 21 సీట్లున్నాయి. అయితే 8, 4 సీట్లున్న యూడీపీ, పీడీఎఫ్ పార్టీలు, ఇతరులతో కలిసి 44 సీట్లతో ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడ అధికార ఎన్పీపీ, కేంద్రంలో బిజెపి సారథ్య ఎన్డీయేలో భాగస్వామి పార్టీనే. అందరూ మిత్రులే. అయితే వారి మధ్య అంతగా సత్సంబంధాలు ఇప్పుడు లేవు. దాంతో.. ఆపార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి కుట్రరచన ప్రారంబించినట్లుగా కనిపిస్తోంది. 

అధికారం కోసం బిజెపి ఎంతగా ఆరాటపడిపోతోందో తెలుసుకోడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఎందుకంటే.. ఇంకో ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా ఆగే ఉద్దేశం లేదన్నట్టుగా ఇప్పుడే ఫిరాయింపులకు తెగబడుతుండడం విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles