ఇండియా అనే పేరుతో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక జట్టుగా ఏర్పడిన నేపథ్యంలో అధికారంలో ఉన్న కమలనాధుల్లో కంగారు మొదలైంది. ఇండియా అనే పేరు ఉచ్చరిస్తే చాలు.. అది పరోక్షంగా తమ ప్రత్యర్ధులకు మేలు చేస్తుందేమోననే భయం వారిని వెన్నాడుతోంది. అందుకే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. మన దేశం గురించి ప్రస్తావించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా అనే పదం వాడనేకూడదని.. కేవలం భారత్ అని మాత్రమే వ్యవహరించాలని వారు నిర్ణయించారు. ప్రతిపక్షాల నేమ్ గేమ్ తొలి దశలో పై చేయి సాధించినట్లే కనిపిస్తోంది. బిజెపి కంగారులోనే వారి విజయం కనిపిస్తోంది.
ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అనే పేరును కొత్త విపక్ష కూటమికి నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇండియా అనే ఆ పేరుతోనే ప్రజలను కూడా ప్రభావితం చేయగలం అనే నమ్మకంతోనే విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. మోడీని ఓడించడానికి ఇండియా ప్రయత్నిస్తోంది.. బిజెపిని గద్దించటం ఒక్కటే ఇండియా లక్ష్యం.. ఇండియాదే అంతిమ విజయం.. లాంటి మాటల గారడీలు తమ కూటమికి మేలు చేస్తాయని అభిప్రాయం వారికి ఉంది.
సరిగ్గా ఈ అంశం దగ్గరే భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతోంది. దేశాన్ని ఇండియా అనకుండా భారత్ అని మాత్రమే అనాలి అని వారు తీర్మానించుకున్నారు. ఈ భయం వారిలో పెరిగితే భారతదేశానికి ఇండియా అనే పేరును రద్దుచేసి అంతర్జాతీయంగా కూడా భారత్ అని మాత్రమే వ్యవహరించేలా ఒక పార్లమెంటు తీర్మానం చేసి అన్ని ప్రపంచ దేశాలకు సమాచారం అందించగలరు కూడా! ఇండియా అంటే దేశం కాదని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల జట్టు మాత్రమే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్ని రకాల మార్గాలను అన్వేషించాలని బిజెపి భావిస్తోంది.
అదే సమయంలో ఇండియా అనే పదంతో పాటు భారత్ అనే పదాన్ని కూడా విపక్ష కూటమి భేటీలో రాహుల్ గాంధీ అతి తరచుగా ఉపయోగించారు. ఇండియా అంటే భారత్ మాత్రమే అనే భావనను ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరకంగా చూస్తే.. ఒక పదం చుట్టూతా కేంద్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న రెండు ప్రధాన కూటముల వ్యూహాలు, పోరాటాలు నడుస్తున్నాయి! ఎవరు పై చేయి సాధిస్తారో.. ఎవరు వెనక పడతారో వేచి చూడాలి.