జనసేన అని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న బలాన్ని బట్టి తెలంగాణ ఎన్నికల్లో తాను సాధించేది ఏమీ లేదని ఆయనకు తెలుసు. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన పూర్తిగా ఏపీ మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నారు. అయినా సరే ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల మీద దృష్టి సారించడం.. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో ఒక సమావేశం నిర్వహించడం.. వారందరికీ, స్థానిక సమస్యల మీద పోరాటాలకు సిద్ధం కావాలంటూ దిశా నిర్దేశం చేయడం తమాషాగా కనిపిస్తుంది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచిగానే బలం ఉన్నది కనుక.. వారి భాగస్వామ్య పార్టీగా తన పార్టీకి కూడా కొన్ని సీట్లు దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్ కోరిక. అయితే తెలంగాణ కమల నేతలు.. పవన్ కళ్యాణ్ ను తమ దరిదాపులకు కూడా రానివ్వడం లేదు! ఈ విషయమై ఇటీవల బందరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఆయన తన ఆక్రోశం వెళ్లగక్కారు కూడా. ‘‘మీకు నా ప్రచారం మాత్రం కావాలి.. నా పార్టీ మాత్రం అక్కర్లేదా’’ అంటూ తెలంగాణ బిజెపి తీరు మీద అక్కసు బయటపెట్టారు. తాజాగా తెలంగాణలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కోఆర్డినేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసుకొని వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయడం గమనిస్తూ ఉంటే కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. కమలం పెద్దలతో బేరం కుదుర్చుకుని వచ్చారా అని అనుమానం కలుగుతుంది. ఆయన వాదనతో కమలం పెద్దలు ఏకీభవించి ఉంటారని, మరి కొన్నాళ్లలో తెలంగాణ పార్టీనేతలను కూడా ఈ దిశగా కన్విన్స్ చేస్తారని అనుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించుకుని అంతో ఇంతో లబ్ధి పొందాలని బిజెపి భావిస్తున్న మాట వాస్తవం. అయితే వారు తనని ప్రచారం చేయాలని కోరుతున్న సమయంలోనే తనకు ప్రతిఫలం ఏమిటో తెలుసుకోవాలని పవన్ ముచ్చట పడుతున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా తమ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాలని ఆయన బిజెపితో ఢిల్లీ పర్యటనలో బేరం పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఒకవేళ బిజెపితో డీల్ లేకపోయినట్లయితే.. తెలంగాణలో 12 స్థానాల్లో మాత్రం జనసేన పోటీ చేస్తే పరువు తక్కువ అవుతుంది. పైగా జనసేన పోటీ పరోక్షంగా కేసీఆర్ కు మేలు చేస్తుంది. మరో కోణంలో నుంచి చూసినప్పుడు తెలంగాణలో కమలంతో విభేదించి బరిలోకి దిగడం అనేది.. ఏపీ రాజకీయాల్లో జనసేన ఇమేజ్ ను ప్రభావితం చేస్తుంది. ఇన్ని సమీకరణలు దృష్ట్యా పవన్ తప్పటడుగు వేయకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు. పవన్ ఆవేదనను బిజెపి అర్థం చేసుకుని ఉంటుందని, లేకపోతే నియోజకవర్గం కో ఆర్డినేటర్ల సమావేశమే జరిగేది కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.