భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తన భవిష్యత్తు ప్రస్థానాన్ని ఏ పార్టీతో కలిసి కొనసాగించాలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఆదివారం నాడు తన అనుచరులు, శ్రేయోభిలాషులు. కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయిన కన్నా లక్ష్మీనారాయణ.. రేపటి అడుగులు ఎలా వేయాలి అనే విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణం లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండవలసిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఆయన అనుచరులు తెలియజేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరికకు ముహూర్తాన్ని కూడా కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
కన్నా టిడిపిలో చేరనుండడం అనే పరిణామం, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నా జనసేనలో చేరి ఉండినప్పటికీ కూడా తమకు పర్వాలేదు కానీ, తెలుగుదేశం లో చేరడం మాత్రం కంటగింపుగా ఉన్నది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ హయాం నుంచి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు, పార్టీ నిర్వహణ దక్షుడిగా పేరు తెచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ కేవలం ఒకటి రెండు నియోజకవర్గాలకు పరిమితమైన నాయకుడు కానే కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాలలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ కన్నా లక్ష్మీనారాయణ కు కూడా నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల స్వల్ప స్థాయిలో అయినా లక్ష్మీనారాయణకు ప్రతి చోట కొన్ని సొంత ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి లాభం చేయడం అనేది వైసీపీకి జీర్ణం కాని విషయం.
అసలే అమరావతిలో రాజధానిని నిర్మించే విషయంలో ప్రజలను వంచించి.. గుంటూరు జిల్లా ప్రజల తీవ్ర ఆగ్రహావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరచూ గురవుతూనే ఉంది. ఈసారి ఎన్నికల్లోనైనా ఆ జిల్లాలో నామమాత్రపు సీట్లు లభిస్తాయా అనే మీమాంసలో పార్టీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ జిల్లాలో అసలే పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుండగా, ఇది వారికి అదనపు దెబ్బ.
కన్నా జనసేనలో చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుకుంది. అదే జరిగితే, పవన్ కళ్యాణ్ పార్టీ మీద మరింత బలంగా కాపు ముద్ర వేయవచ్చునని వారు ఊహించారు. పవన్ కళ్యాణ్ కాపులపై తప్ప మరెవరి మీద ప్రభావం చూపించలేకపోతున్నారని బురద పులమదలచుకున్నారు. అయితే వారి పాచిక పారలేదు. కన్నా తెలుగుదేశంలో చేరుతున్నారు. కన్నాద్వారా రాగల అదనపు బలం మొత్తం తెలుగుదేశానికే దక్కుతుందని భాధపడుతున్నారు.
గుంటూరు జిల్లా కమ్మసామాజికవర్గం నుంచి ఒకరికి ఈసారి చిన్న కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వదలచుకుంటున్న జగన్, ఇప్పుడు ప్రయారిటీస్ మార్చుకుని కాపుల మీద ఎగస్ట్రా ఫోకస్ పెడతారేమో చూడాలి.