ఏపీ బీజేపీకి సంబంధించినంత వరకు ఆ పార్టీలో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు మీద ఆరోపణ, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా అనేవి కేవలం ప్రారంభం మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముందు ముందు ఏపీ కమలదళానికి మరిన్ని షాక్ లు తప్పవని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చూపించిన బాటలోనే ఇంకొందరు సీనియర్లు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలలో అంచనాలు సాగుతున్నాయి.
ఇంతకు కన్నా లక్ష్మీనారాయణ చూపించిన మార్గం అంటే ఏమిటి…?
ఈ మార్గం ప్రధానంగా రెండు భాగాలు. ఏపీ బీజేపీ సారధి సోము వీర్రాజు మీద మాత్రం సమృద్ధిగా విమర్శలు కురిపించడం.. ఆయన వ్యవహార సరళి కారణంగానే పార్టీని వదిలి వెళ్ళవలసి వస్తోందని చెప్పడం ఒకటో భాగం. వచ్చే ఎన్నికలు ముగిసే వరకు సోము వీర్రాజును మార్చకూడదని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రచారం.. పార్టీకి అంతో ఇంతో ఉన్న క్రెడిబిలిటీ నీ దెబ్బ తీస్తుంది. అదే సమయంలో కన్నా మార్గంలో రెండో భాగం ఏమిటంటే.. ప్రధాని మోడీ నీ మాత్రం ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తించడం. దీనివలన తమకు ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకోవడం. కన్నా అదే పని చేశారు.
ఇది ఇతర అసంతృప్త కమల నాయకులకు ఆదర్శమార్గంగా కనిపిస్తోంది. జీవీఎల్ నరసింహారావు వంటి కొంతమంది మాత్రం సోము వీర్రాజుకు నిత్యం భజన చేస్తూ ఉంటారు గానీ.. ఆయన నాయకత్వం పట్ల చాలామంది సీనియర్లలో అసంతృప్తి ఉంది. బిజెపి అంటేనే క్రమశిక్షణ ఉండే పార్టీ గనుక వారెవరు బయటపడటం లేదు. అలాగని ఏపీలో పార్టీ భవిష్యత్తు మీద కూడా వారికి భ్రమలు తొలగుతున్నాయి. ఏదో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నది కనుక కొన్ని పైరవీలు చేసుకుంటూ కాలం గడపవచ్చునని, కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఆ వైభవం వెలగబెట్టవచ్చునని కొందరు మిన్నకుండిపోతున్నారు. కానీ క్రియాశీల, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలలో భవిష్యత్తు కోరుకుంటున్న వారు మాత్రం ఏపీలో బిజెపి పరిస్థితి గురించి, భవిష్యత్తు గురించి పునరాలోచనలో పడుతున్నారు. అలాగని పార్టీని వీడిపోవాలంటే భయం. ఈడీ దాడులు ఐటీ దాడులు అంటూ కేంద్రం తమను టార్గెట్ చేస్తుందేమోననే భయం! అలా భయపడుతున్న వారందరికీ కన్నా మంచి మార్గం చూపించారు. ప్రధానిగా నరేంద్ర మోడీని భజన చేస్తూ పొగడాలి, రాష్ట్రంలో సోమ వీర్రాజు నాయకత్వాన్ని తెగడాలి. ఆయన పార్టీని నాశనం చేస్తున్నారని నింద వేసి, తాము రాజీనామా చేయాలి. కొత్తగా ఏ పార్టీలో చేరుతారనేది పెద్ద విషయం కాదు. ఏ పార్టీలో చేరిన బిజెపి స్పందన ఒకే తీరుగా ఉంటుంది. పార్టీ మారినందువలన తమ నాయకుల పై బిజెపి ఆగ్రహించడం కక్షకట్టడం మరి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలు కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలే. కాబట్టి మోడీని పొగుడుతూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఇబ్బంది లేకుండా రాజకీయం కొనసాగించవచ్చునని చాలామంది కమలం సీనియర్లు మధనం సాగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.