కన్నడనాట ఎన్నికల ప్రభావం ఎంతో కొంత తెలుగురాష్ట్రాల మీద కూడా ఉంటుంది. కేవలం పొరుగున ఉన్నందువల్ల మాత్రమే కాకపోవచ్చు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా జాస్తిగా ఉండే నేపథ్యంలో తెలుగు ప్రముఖులు కూడా అనేకమంది కన్నడ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రచారాలు సాగిస్తుంటారు. సినీ ప్రముఖుల సంగతి చెప్పక్కర్లేదు. ప్రతిసారీ కన్నడ నాట ఎన్నికల్లో తెలుగు హీరోలు ప్రచారం చేయడం జరుగుతోంది.
సినీ సెలబ్రిటీల ప్రచారాలపై ఈ దఫా కన్నడ ఎన్నికల్లో బిజెపి ఎక్కువగా ఆధారపడుతోంది. గతంలో బిజెపి విధానాలను నిశితంగా విమర్శించిన నేపథ్యం ఉన్న హీరో, కిచ్చా సుదీప్ తాజాగా కమలదళం తరఫున ప్రచారానికి దిగుతుండడం విశేషం. ఇలాంటి సమయంలో హీరో పవన్ కల్యాణ్ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారని, బిజెపి తరఫున ఆయన ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. సినీ ప్రచారానికి బాగా ప్రాధాన్యం ఇస్తున్న బిజెపి సీఎం బొమ్మై పవన్ ప్రచారాన్ని కూడా ఎడ్వాంటేజీగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ కు గతంలో కూడా కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన చరిత్ర ఉంది. కాబట్టి ఆయన ఈ ఎన్నికల ప్రచారానికి కూడా వెళతారని అనుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆయన పూర్తిగా బిజెపి అనుకూల ప్రచారమే నిర్వహిస్తారు. ఆ వ్యవహారంతో మన తెలుగు రాజకీయాలకు చిన్న లంకె ఉంది.
ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత.. బిజెపితో సంబంధం, పొత్తుబంధం ఉన్నదో లేదో కూడా తెలియని సస్పెన్స్ లోకి పవన్ జనాన్ని నెట్టేశారు. భవిష్యత్తులో బాగుంటుంది అంటున్న పవన్ వర్తమానం గురించి చెప్పడం లేదు. అయితే ఆయన మాటలను, బిజెపి పరిణామాలను గమనిస్తున్న వారు మాత్రం పొత్తు బంధం తెగినట్టేనని, అధికారికంగా పవన్ ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. అయితే ఏపీలో రాజకీయం వేడెక్కుతుండగా.. పొత్తుల సంగతి పవన్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశంతో కలిసి రాకుంటే గనుక.. బిజెపితో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడిన పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసి, తాను వారికోసం నిలబడగలనని అధిష్టానానికి కూడా సంకేతం ఇచ్చి, ఆ తర్వాత.. ఏపీ ప్రయోజనాల కోసం అని ప్రకటించి తెలుగుదేశంతో పొత్తులను అధికారికంగా వెల్లడిస్తారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత.. ఏపీ విపక్షాలకు సంబంధించిన పొత్తుల అధికారిక ప్రకటన వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
కన్నడ ఎన్నికలయ్యేదాకా.. పవన్ ఏసంగతీ తేల్చరేమో!
Thursday, November 21, 2024