‘వై నాట్ 175’ నినాదంతో పార్టీని గెలుపు బాటలో నడిపించాలని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో ఝలక్ తినిపించాలని విపక్షాలు చాలా పట్టుదలతో ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబునాయుడు వ్యూహ చాతుర్యానికి కడప జిల్లాకు చెందిన నాయకుడిని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా చేయడమే పెద్ద ఉదాహరణ అని అంతా అంటున్నారు. అది మొదలుగా కడప జిల్లా మీద చంద్రబాబునాయుడు స్పెషల్ ఫోకస్ అడుగడుగునా కనిపిస్తోంది. అక్కడ అభ్యర్థులను మార్చడం మీద, ఇతర పార్టీల నుంచి చేరికల మీద కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కడప జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ.. మరింత జోష్ నింపడానికి కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పులివెందులలో కూడా జగన్ ను ఓడించడం సాధ్యం కాకపోయినా, మెజారిటీకి గండికొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు ఫోకస్ వ్యూహాత్మక ధోరణిలో సాగుతోంది.
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా కడప జిల్లా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోను, ఉత్తరాంధ్రలోను తమ పార్టీ బలంగా ఉన్నదని భావిస్తున్న పవన్ కల్యాణ్.. రాయలసీమను పట్టించుకోబోవడం లేదని తొలుత పార్టీ వర్గాల నుంచి వినిపించింది. అక్కడ ఎంత శ్రద్ధ పెట్టినా సీట్లు గెలవడం కష్టం అనే ఉద్దేశానికి పవన్ వచ్చినట్టుగా చెప్పుకున్నారు. దానికి తగ్గట్టే ఆయన ప్రవర్తన కూడా కనిపించింది.
అయితే పవన్ కల్యాణ్ తాజాగా కడప జిల్లా మీద ఫోకస్ పెడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు గతంలో వరదల సందర్భంగా ఎంతటి విధ్వంసానికి కారణమైందో అందరికీ తెలుసు. సాధారణంగా రాజకీయ విమర్శల కంటె.. ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండే పవన్ కల్యాణ్.. అన్నమయ్య డ్యామ్ బాధిత ప్రజల పక్షాన చాలాకాలంగా గళమెత్తుతున్నారు. ఆ ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించారు కూడా. ఇళ్లు కోల్పోయిన వారికి సత్వరమే ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు.
తాజాగా నెలరోజుల్లోగా బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కడప జిల్లా కలెక్టరు చేసిన ప్రకటనపై కూడా పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ హామీని కలెక్టరు ఎంత మేర నిలబెట్టుకుంటారో నెలరోజులు వేచిచూస్తామని పవన్ అంటున్నారు. ప్రభుత్వం విఫలమైతే గనుక.. జనసేన అన్నమయ్య డ్యామ్ బాధితుల పక్షాన ఉద్యమ కార్యచరణకు దిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవైపు చంద్రబాబునాయుడు రాజకీయ వ్యూహాలు, మరోవైపు పవన్ కల్యాణ్ ఉద్యమ ప్రణాళికతో కడప జిల్లాలో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది.