కొమ్మినేని శ్రీనివాసరావు అంటే.. తెలుగులో వార్తా ఛానెళ్లలో చర్చాకార్యక్రమాలు చూసే చాలా మందికి బాగా తెలుసు. తొలుత ఏబీఎన్ లో, ఆ తర్వాత ఎన్టీవీలో చర్చలు నిర్వహించిన ఆయన నెమ్మదిగా సాక్షిటీవీకి చేరి.. అక్కడ జగన్ అనుకూల వైఖరితో చర్చలు నిర్వహించి.. సుదీర్ఘకాలం సేవలందించి.. మొత్తానికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అంటే.. జర్నలిస్టుల సంక్షేమ కోసం పనిచేయాలి. జర్నలిజం విలువల కోసం పనిచేయాలి. జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు గట్రా ఏర్పాటు చేయడం కోసం పనిచేయాలి. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అనే పదవి యొక్క సకల కార్యకలాపాలు జర్నలిజంతో మాత్రమే ముడిపడి ఉంటాయి. అయితే కొమ్మినేని తన పరిధి మీరి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తదలచుకున్నారు. రాజకీయ విమర్శలు చేయదలచుకున్నారు. అయితే వాటికి లౌక్యంగా కాస్త జర్నలిస్టిక్ టచ్ కూడా ఇవ్వాలనుకున్నారు.
కందుకూరులో చంద్రబాబునాయుడు కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిది మంది దుర్మరణం పాలైతే ఆ సంఘటన స్థలాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు తాను స్వయంగా వెళ్లి పరిశీలించారు. తాను ఏమైనా ప్రమాదాలను పరిశోధించి ఆనుపానులు కనిపెట్టే పోలీసు నిపుణుడు అని అనుకున్నారో ఏమో గానీ.. ఆ సంఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ఆయన ధ్రువీకరించారు. అలాగే.. ఇరుకు సందుల్లో సభ నిర్వహించడం వల్లనూ, డ్రోన్ షూట్ చేయడం వల్లనూ తొక్కిసలాట జరిగిందని.. వైసీపీ దళాలన్నీ కొన్ని రోజులుగా పాడుతున్న పాచిపోయిన పాటనే కొమ్మినేని మళ్లీ వినిపించారు.
ఆ రకంగా రాజకీయ విమర్శలనే తొలుత వినిపించిన కొమ్మినేని తర్వాత జర్నలిస్టిక్ టచ్ ఇచ్చారు. పోలీసుల వైఫల్యం అంటూ పత్రికల్లో అసత్య వార్తలు రాశారని నింద వేశారు. పోలీసు వైఫల్యం గురించిన సంపాదకీయాల్లో అభ్యంతరకర పదజాలం ఉందని కూడా ఆయన విశ్లేషించారు. ఇలాంటి మేథోప్రదర్శన జరుగుతుండగా.. ఆయనకు స్థానిక విలేకర్లనుంచి ఎదురుదాడి మొదలైంది.
మీరు జర్నలిస్టుగా ఉంటూ ఒక పార్టీకి కొమ్ముకాయలేదా? అంటూ విలేకర్లు ప్రశ్నించారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అయ్యాక రాష్ట్రంలో విలేకర్లకు ఏం మేలు చేశారంటూ నిలదీశారు. చివరకు వారి ధాటికి తట్టుకోలేక.. ‘నాకు చేతకాదు..’ అంటూ అక్కణ్నించి వెళ్లిపోయారు.
ఏ చానెల్ లో పనిచేసినప్పుడు ఆ చానెల్ మద్దతిచ్చే పార్టీకి కొమ్ము కాస్తూ చివరికి సాక్షిలో చేరారు గనుక.. వైసీపీ బాకా ఊదుతూ శేషజీవితం గడిపారు. ఏదో తన భజనకు తగ్గట్టుగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. తీరా ఇప్పుడు తనకు సంబంధం లేకపోయినా.. కందుకూరు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి.. రాజకీయ విమర్శలు చేసి అభాసుపాలయ్యారు కొమ్మినేని.
ఓవరాక్షన్ చేశారు.. చేతకాదని ఒప్పుకున్నారు!
Thursday, November 14, 2024