ఓపీఎస్‌పై మాత్రం ఇంకా దాటవేత ధోరణే!

Wednesday, January 22, 2025

మహానాడు సందర్భంగా ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఆ రోజు నుంచి కొంతకాలం పాటు టీడీపీ మేనిఫెస్టోను విమర్శిస్తూ వచ్చిన అధికార పార్టీ నాయకులు, అది సాధించగల ప్రజాదరణను తాము అడ్డుకోవడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యామ్నాయంగా తాము ఏ ఏ వర్గాలకు ఎరవేయాలో, ఏ వర్గాలను మచ్చిక చేసుకుని తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగమేనా అన్నట్లుగా సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం నిజంగా కొన్ని వేల మందికి శుభవార్త. 2014 జూన్ 2వ తేదీ నాటికి, అంటే రాష్ట్ర విభజన జరిగిన సమయానికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగులరైజ్ చేయనున్నట్లుగా బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయని ఆయన అన్నారు. అదే క్రమంలో కొత్త పీఆర్సీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం అని బొత్స హామీ ఇచ్చారు.

పాదయాత్ర సమయంలో ఉద్యోగ సంఘాలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించే విషయంలో మాత్రం  ప్రభుత్వం ఇంకా దాటవేత ధోరణిని అనుసరిస్తోంది. కొత్త పెన్షన్ విధానం పై బుధవారం జరిగే క్యాబినెట్లో కూడా చర్చిస్తామని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా కొన్ని సవరణలతో కూడిన సరికొత్త పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెబుతున్నారు. అంతేతప్ప ఐదేళ్లుగా హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే సంగతి తేల్చడం లేదు. దాటవేస్తున్నారు.

పిఆర్సి విషయంలో గతంలో దానిని అమలు చేసే సందర్భంగా ఉద్యోగ సంఘాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. అప్పటినుంచి ఇంచుమించుగా అన్ని ఉద్యోగ సంఘాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష గట్టి ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఈనాటికీ కూడా భగభగమంటున్నాయి. కొత్త పిఆర్సి వేయడం ద్వారా ఈ వర్గాల్లో అందరినీ ఒకేసారిగా బుజ్జగించవచ్చునని అనుకుంటున్న జగన్ సర్కారు ఆలోచన ఏ మేరకు ఫలితాలనిస్తుందో క్లారిటీ లేదు. ఓ పి ఎస్ ను పునరుద్ధరించకుండా ఎన్ని రకాల కొత్త, రకరకాల హామీలతో ముందుకు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాటలను ఉద్యోగ సంఘాలు విశ్వసించరని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles