ఓట్లు వేసే వాళ్లకు ఎన్నికల ముందు రోజున డబ్బులు పంచి పెడితే సరిపోతుంది.. తలా ఒక క్వార్టర్ లిక్కర్ ఇస్తే సరిపోతుంది.. వారిని ఆ ఒక్కరోజు ప్రలోభ పెట్టి ప్రసన్నం చేసుకుంటే చాలు. కానీ ఓట్లు వేయించ గల వాళ్ళ సంగతి అలా కాదు! వారిని ఇప్పటినుంచే ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రలోభ పెట్టాలి, మచ్చిక చేసుకోవాలి.. ఇదే నవతరం రాజకీయ వ్యూహం. గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి రాజకీయ భవిష్యత్తును కోరుకుంటున్న వల్లభనేని వంశీ.. ఈ తరహా ప్రలోభ, తాయిలాల రాజకీయంలో ఆరితేరిపోతున్నారు.
సాధారణంగా ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఎన్నికల సెటప్ లో అలాంటి వ్యక్తులను నాయకులు కూడా ఆదరిస్తారు. వారి ద్వారా తమకు పెద్ద సంఖ్యలో ఓట్లు పడతాయని ఆశిస్తారు. కుల సంఘాల నాయకులు, మత సంఘాల పెద్దలు లాంటి వాళ్లంతా ఈ కోవలోకే వస్తారు. ఇప్పుడు తాజాగా గ్రామ వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని కూడా ఇలా ఓట్లు వేయించ గల ఒపీనియన్ మేకర్స్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.
ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్న తరుణంలోనే.. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే వస్తున్నాయి జగన్ను మళ్ళీ గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని లబ్ధిదారులను ఊదరగొట్టిస్తోంది. అదే సమయంలో జగనన్న ప్రభుత్వం రాకపోతే గనుక ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అని ప్రజలను భయపెట్టే ప్రయత్నం ఈ వాలంటీర్ల ద్వారానే చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులుగా తయారవుతున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందుగా ఈ వాలంటీర్లను, సిబ్బందిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్ లను కానుకగా అందిస్తున్నారు. వాలంటీర్ల వద్ద సరైన ఫోన్లు లేవు అనే మిష చూపించి కొత్త బ్రాండెడ్ ఫోన్లను వారికి కానుకగా ఇస్తున్నారు. ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటూ వారితో ఓట్లు వేయించ గల శక్తులుగా మారుతున్న వాలంటీర్లందరూ.. తనకు అనుకూలంగా ఉంటే చాలు గెలుపు సునాయాసం అవుతుందని వల్లభనేని వంశీ భ్రమ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
వాలంటీర్లను ప్రసన్నం చేసుకోవడంలో వంశీ కి ఇంకో గూఢాలోచన కూడా ఉన్నదని కొందరు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రధానంగా సర్వేల మీదనే ఆధారపడుతున్నారు. అలాంటి నేపథ్యంలో తన నియోజకవర్గంలో అభ్యర్థిత్వం దక్కుతుందో లేదో అనే డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్న వంశీ.. వాలంటీర్ల ద్వారా తన గురించి ప్రజలకు మంచిగా చెప్పిస్తూ ఉంటే.. ఏ ఐ ప్యాక్ ప్రతినిధిలో వచ్చి సర్వే చేసినప్పుడు కాస్త అనుకూల వాతావరణం ఏర్పడుతుందని దూరాలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే వాలంటీర్లకు ఇప్పటినుంచే తాయిలాలు పంచుతున్నారని భావిస్తున్నారు.
ఓట్లు వేయించే వాళ్లకు ఇప్పటి నుంచే తాయిలాలు!
Saturday, November 16, 2024