కేసీఆర్ దేశమంతా తాను ప్రభంజనం సృష్టించాలని కలగంటున్నారు. ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. దేశమంతా ప్రభావం చూపించాలని అనుకుంటున్న వ్యక్తి.. ముందు ఇంటగెలిచి రచ్చగెలవాలి కదా. ముందు సోదర తెలుగు రాష్ట్రంలో తన ప్రాభవం చూపించాలి. తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో తన విలువ ఎంత ఉన్నదో నిరూపించుకోవాలి. ఆ తర్వాత.. దేశమంతా విజయకేతనం ఎగురవేస్తానని బయల్దేరాలి. మరి ఆ ప్రయత్నంలో కేసీఆర్ కదలికలు సరైన మార్గంలోనే ఉంటున్నాయా? ఏపీకి సంబంధించినంత వరకు భారాస విస్తరణకు ఆయన ఎంచుకున్న తొలి అడుగు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతోంది.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
సోదర తెలుగురాష్ట్రం ఏపీలో కూడా తన ప్రభంజనం చూపించడానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. నిజానికి ఆయన పార్టీని ప్రకటిస్తున్న రోజునే.. ఏపీలో కూడా అభినందనలు ఫ్లెక్సీలు వెలిశాయి. తీరా ఇప్పుడు ముగ్గురు పేరున్న నాయకులు భారాసకు చిక్కారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న, మొన్నటిదాకా బిజెపిలో ఉన్న రావెల కిశోర్ బాబు, మూడు ఎన్నికలకు మూడు పార్టీలు మారిన తోట చంద్రశేఖర్, చింతల పార్థసారది లను పార్టీలో చేర్చుకుంటున్నారు. తోట చంద్రశేఖర్ సారథ్యం వహించబోతున్నారు. ఏపీ భారాసను ఘనంగా ప్రారంభించాలని అనుకోవడంలో తప్పులేదు. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. చాలా జిల్లాలనుంచి సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారని, పార్టీని త్వరలో విస్తరిస్తామని అంటున్నారు.
ఇదంతా బాగుంది. కానీ.. ఓటిగుర్రాలను నమ్ముకుని.. కేసీఆర్ ఏపీలో ఏం సాధించగలనని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. తోట చంద్రశేఖర్ పుష్కలంగా ఆర్థిక వనరులు ఉన్న నాయకుడు. ఆయన పార్టీని విస్తరించడానికి అవసరమైన డబ్బు ఖర్చు పెట్టుకోగలడనే నమ్మకం వారికి ఉండొచ్చు. కానీ.. ఆయన ప్రజలను ఆకట్టుకోగల, ప్రజలను నమ్మించగల నాయకుడేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసినప్పటినుంచి.. మూడు దఫాలుగా మూడు పార్టీల తరఫున ఎన్నికల గోదాలోకి దిగి ప్రతిసారీ ఓడిపోయారు. ఆయనకు టికెట్ ఇచ్చిన పార్టీలు కూడా ఓడిపోయాయి. రావెల కిశోర్ బాబుకు కూడా సొంతంగా గెలవగలిగేంత సీన్ లేదు. చింతల పార్థసారధి సరే సరి. వీరందరూ బలమైన పార్టీలో ఉంటే.. తమ ధన వనరులతో కొంత విలువ జతచేసి నెగ్గగలరేమో తప్ప.. ఇప్పుడే పురుడు పోసుకున్న పార్టీని లేపి నిలబెట్టడానికి ఏమాత్రం ఉపయోగపడతారో సందేహమే.