సామాన్య ప్రజలకు విశ్వాసాలు మెండుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతంలో మధ్యతరగతి, పేదవర్గాలకు చెందిన ప్రజల్లో ఇలాంటి విశ్వసాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారిని వారికి అపరిమితంగా ఉండే విశ్వాసాలతోనే కొట్టాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు తన తాజా కుట్రకు తెరతీస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాలంటీర్లను జనంమీదికి ప్రయోగించడం ద్వారా మాత్రమే, వాలంటీర్లతో జనాన్ని భయపెట్టడం ద్వారా మాత్రమే తమకు ఓట్లు రాలుతాయని చాలాకాలంగా నమ్ముతున్న ధర్మాన తాజాగా ప్రజలతో దేవుడి మీద ఒట్టు వేయించాలని సూచిస్తూ ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాల్సిందిగా చెప్పాలని, జగన్ మళ్లీ గెలవకపోతే సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయని ప్రజలకు చెప్పాలని ధర్మాన చాలా కాలంగా ఉపదేశాలు ఇస్తున్నారు. జగన్ మళ్లీ గెలవకపోతే వాలంటీర్ల ఉద్యోగాలు అన్నీ పోతాయని కూడా పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వాలంటీర్లతో మీటింగు పెట్టుకుని వారికి మరో కర్తవ్యోపదేశం చేశారు.
ప్రజల వద్దకు వెళ్లి జగనన్నకు ఓట్లు వేయాల్సిందిగా అడగాలని, ఒప్పుకున్న వాళ్లతో దేవుడి పటం మీద ఆమేరకు ప్రమాణం చేయించాలని చెబుతున్నారు. దేవుడి మీద ఒట్టు వేయిస్తే.. ఆ ఒట్టు మీరడానికి సామాన్యులు, దేవుడి పట్ల విశ్వాసం ఉన్నవారు భయపడతారనేది ధర్మానగారి థియరీ. ఓటర్లను మూడు రకాలుగా గుర్తించాలట. వైసీపీకి ఓటు వేసేవారు, టీడీపీకి వేసేవారు, గోడమీది పిల్లి లాంటి వారు అనే వర్గాలు ఉండాలట. ఆవర్గాల ప్రకారం వారితో మాట్లాడాలట. తెలుగుదేశం ఓటర్లను ఒక్క కుటుంబాన్ని వైసీపీకి ఓటు వేసేలా మార్చినా సరే.. తమకు వేల ఓట్లు లాభిస్తాయట. అందుకోసం పథకాలు రావు అనే భయంతో ప్రజల బలహీనత మీద దెబ్బ కొట్టాలట, కులపెద్దల మాట వినే వారిని గుర్తించి వారికి కులపెద్దలతో చెప్పించాలట.
బలవంతంగా అయినా సరే.. ప్రజలతో దేవుడి మీద ప్రమాణం చేయిస్తే చాలు.. ఇక వారు చచ్చినట్టుగా ఓటు వేసి తీరుతారనే ధర్మాన గారికి ఎంత నమ్మకం ఉన్నదో చూస్తే జాలి కలుగుతుంది.
అయినా ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ధర్మాన లాంటి పెద్దలందరూ తాము మంత్రులుగా ప్రమాణం చేసేప్పుడు.. ‘‘రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా’’ ప్రమాణం చేస్తున్నారు. మరి వారు ఆ ప్రమాణం మీద నిలబడుతున్నారా? చట్టవ్యతిరేకంగా ఎంత అవినీతికి పాల్పడుతున్నారో వారి ఆత్మసాకికి తెలుసు కదా. మరి తాము ఏ దేవుడిమీదనైతే ప్రమాణం చేశారో , ఆ దేవుడు గమనిస్తుంటాడనే భయం వారికి లేదా? అని మనకు అనిపిస్తుంది. వాలంటీర్లను వాడి బలవంతంగా ప్రజలతో ఒట్టు వేయిస్తే, వాలంటీర్లు అటు వెళ్లగానే ఆ జనం ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తారని కూడా ధర్మాన తెలుసుకోవాలి.
ఒట్టుతో గట్టిగా కొట్టాలని ధర్మాన కుట్ర!
Sunday, December 22, 2024