ఒక అస్త్రం బయటకు తీసిన గులాబీ దళపతి!

Monday, September 16, 2024

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్నికల అడుగులు వేస్తున్నారు. నిజానికి ఏపీ వంటి పరిస్థితి కాదు. మరో ఆరునెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వరాలు ప్రకటించడానికి పార్టీలు సమాయత్తం కావడం ఒక ఎత్తు అయితే, ప్రకటించని వరాలను కూడా కార్యరూంలోకి తెస్తూ కొత్తశైలిని ప్రదర్శించడం మరో ఎత్తు. కేసీఆర్ అనూహ్యంగా వికలాంగుల పెన్షన్ ను వెయ్యిరూపాయలు పెంచి, వచ్చే నెలనుంచి రూ.4,116 వంతున ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. లబ్ధిదారుల్లో ఖచ్చితంగా కేసీఆర్ సర్కారు మీద సదభిప్రాయం కలిగించే నిర్ణయం ఇది.
కేసీఆర్ శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పట్లో ప్రభుత్వాలు రకరకాల పథకాల కింద పేదలకు, లబ్ధిదారులకు నెలవారీగా సొమ్ములు ముట్టజెప్పడాన్నే సంక్షేమ పథకాలుగా భావిస్తూ ముందుకు సాగుతున్నాయి. వికలాంగులను ఆదుకోవాలనే ఆలోచన మంచిదే గానీ.. డబ్బు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం అన్నట్టుగా భావించడం తప్పనే అభిప్రాయం కొందరిలో ఉంది.
వికలాంగుల పెన్షన్ ను రూ.4116 చేయడం వల్ల కేసీఆర్ కు కొన్ని కొత్త ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. వికలాంగులు సంఖ్యాపరంగా పోల్చిచూస్తూ తక్కువగానే ఉంటారు. కానీ.. వీరికి పెన్షన్ పెంచడం వలన వృద్ధాప్య పెన్షన్లు కూడా పెరుగుతాయనే భావన వాటిని పొందే లబ్ధిదారులకు ఏర్పడుతుంది. వారు ఎన్నికల దాకా ఎదురుచూస్తూ ఉంటారు. వృద్ధాప్య పెన్షన్లను పెంచే ప్రకటన వస్తుందని ఆశపడుతుంటారు. అప్పటిదాకా రాకపోతే గనుక.. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తారు. వ్యతిరేకత పెంచుకుంటారు. అయితే వృద్ధాప్య పెన్షన్లు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి వెయ్యి కాదు కదా.. నెలకు రూ.500 పెంచినా కూడా.. ప్రభుత్వం మీద పడే భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు తట్టుకోవడం కష్టం. పైగా తెలంగాణ ఎన్ని పనులు చేపడుతున్నప్పటికీ.. ఇంకా అప్పులు చేస్తూ బండి నడుపుతోంది. వృద్ధులు, వితంతువులు కూడా తమ తమ పెన్షన్ల పెంపు గురించి కేసీఆర్ మీద ఆశలు పెంచుకుంటే, ఆయన తీర్చలేకపోతే ఇబ్బంది అవుతుంది.
ఈ సభలో మళ్లీ కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. గత రెండు సభల్లో కేవలం కాంగ్రెస్ ను తిట్టి, బిజెపిని పట్టించుకోకపోవడం వలన.. బిజెపితో కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నారని, లేదా, కాంగ్రెస్ ను చూసి ఎక్కువ భయపడుతున్నారని పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలాగా.. కేసీఆర్ ఈసారి బిజెపి మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ సగం ముంచితే, బిజెపి పూర్తిగా ముంచుతోందంటూ.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles