ఒకే ఒక్క సభ.. వారిలో ప్రకంపనలు పుట్టించిందే..!

Wednesday, December 18, 2024

సుదీర్ఘకాలం విరామం తర్వాత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనం, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అస్తిత్వం నామమాత్రంగా మారిపోయి ఉన్న నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు కూడా.. అధికారంలోకి వచ్చేస్తున్నాం లాంటి అతిశయమైన డైలాగులు వేయకుండా.. పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని మాత్రమే సభలో అన్నారు. తెలంగాణలో తెలుగుదేశమే లేకుండాపోయిందని అనుకుంటున్న వారికి ఈ సభ పెద్ద పాఠం అని కూడా సెలవిచ్చారు. కానీ ఈ ఒక్క సభే.. భారత రాష్ట్ర సమితిలో ప్రకంపనలు పుట్టించినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో మళ్లీ ప్రజాదరణ పెంచుకుంటే.. అది తమ పార్టీకి నష్టదాయకం అని వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఖమ్మం సభలో చంద్రబాబు తెలుగుదేశం హయాంలో తెలంగాణ అభివృద్ధి, తన హయాంలో హైదరాబాదు అభివృద్ధి ఎంతగా జరిగాయో చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్‌గా హరీష్ రావు సారథ్యంలో ఏకంగా నలుగురు మంత్రులు ఆయన మీద ఎదురుదాడికి దిగడం విశేషం. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైందంటూ హరీష్ రావు విమర్శలు చేశారు. మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ లు కూడా ఆయనతో కలిసి విమర్శలు సంధించారు. కల్వకుంట్ల కవిత కూడా.. తెలంగాణలో చంద్రబాబు ఆటలు సాగవు అంటూ తక్షణ స్పందన చూపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రగతిలో తన చిత్తశుద్ధి గురించి చెప్పిన మాటలు.. అవన్నీ అబద్ధాలే అని భారాస నాయకులు కొట్టిపారేయడం ఇవన్నీ పక్కన పెడదాం. చంద్రబాబు పెట్టిన ఒకే ఒక్క సభకు అధికార పార్టీలో కదలిక రావడమే తమాషాగా కనిపిస్తోంది. ఒకవైపు వైతెపా సారథి షర్మిల కొన్ని నెలలనుంచి కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో నేనే అధికారంలోకి వచ్చేస్తున్నా, మొత్తం తెలంగాణను ఉద్ధరించేయబోతున్నా అంటూ కేసీఆర్ సర్కారును ఒక రేంజిలో విమర్శిస్తున్నారు. మొన్నటి అరెస్టుల హైడ్రామా మినహా ఆమె వ్యాఖ్యల పట్ల భారాస నాయకులు ఎన్నడూ సీరియస్ గా స్పందించింది లేదు. ఆమె ఎన్ని సభలు నిర్వహించినా.. పెద్ద ప్రభావం ఉండదన్నట్లుగా ప్రయత్నపూర్వకంగా ‘ఇగ్నోర్’ చేస్తూ వచ్చారు.
కానీ చంద్రబాబు సభను వారు ఇగ్నోర్ చేయలేకపోయినట్టుగా, భయపడినట్టుగా కనిపిస్తోంది. ఖమ్మంలో తెలుగుదేశం సభ చాలా విజయవంతం అయింది. తెలుగుదేశం మీద అభిమానం ఉన్న వాళ్లకి చాలా ఉత్సాహం ఇచ్చింది ఈ సభ. రాష్ట్రమంతా కూడా ఆ పార్టీ తిరిగి ఊపిరిపోసుకోగలదన్న అభిప్రాయమూ ఏర్పడింది. పైగా ఈ సభ జరిగిన వెంటనే నిజామాబాద్ లో తర్వాతి సభ నిర్వహించబోతున్నట్టుగా కూడా పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లుగా చంద్రబాబునాయుడు తెలంగాణ రాజకీయాలను నిర్లిప్తంగా గమనిస్తుండగా.. ఇప్పుడు పార్టీని మళ్లీ ట్రాక్ మీద పెడుతుండడాన్ని చూసి భారాస నేతల జడుసుకుంటున్నట్టున్నారు. అందుకే ఒక్కంటంటే ఒక్క సభ జరగగానే ఎదురుదాడికి దిగుతున్నారు అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles