ఒంటరి అయిపోయాక, షర్మిల ప్రగల్భాలు!

Wednesday, January 22, 2025

వైఎస్సార్ తెలంగాణ అనే పార్టీని స్థాపించిన నాటినుంచి వైఎస్ షర్మిల కాలికి బలపం కట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నారు. ఆమె కాలినడకన వెళుతున్న ప్రతిచోటా ఎంతో కొంత జనం గుమికూడుతూనే ఉన్నారు. అయితే ఈ రోజుల్లో జనాలు మూగడాన్ని బట్టి.. పార్టీల, నాయకుల ప్రజాదరణను అంచనా వేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. షర్మిల చాలా కష్టపడి పాదయాత్రలు చేస్తూ.. కేసీఆర్ మీద తీవ్రాతితీవ్రంగా విరుచుకుపడుతూ రాజకీయం కొనసాగిస్తున్నారు గానీ.. ఆమె అస్తిత్వాన్ని ప్రధాన పార్టీలు ఏవీ కనీసం గుర్తించడం లేదు.
ఈ దశకు వచ్చిన తర్వాత.. షర్మిల తాజాగా.. తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీని మరే ఇతర పార్టీతోనూ విలీనం చేయబోయేది లేదని, ఏ ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది కూడా లేదని తేల్చి చెప్పారు. పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అని వైఎస్ జగన్ గురించి ఆయన అభిమానులు చాలా తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్సార్ తనయగా షర్మిల.. తాను కూడా సింహం పిల్లనేనని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లున్నారు. తమ పార్టీ ఒంటరిగా తెలంగాణ వ్యాప్తంగా బరిలో ఉంటుందని సెలవిచ్చారు.
అయితే ఇది ధీమాగా చెప్పిందేనే.. లేదా మేకపోతు గాంభీర్యంతో చెప్పినదా అనేది గమనించాలి. ఎందుకంటే.. షర్మిల తెలంగాణలోని ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించారు. ఢిల్లీలోని బిజెపి నాయకులతో జరిగిన భేటీలు పొత్తుల కోసమే అనడానికి అవకాశం తక్కువే గానీ, కేవలం పొత్తుల ఎజెండాతో వామపక్షాల నాయకులు, కోదండరాం లాంటి వారితో సమావేశం అయ్యారు. కాంగ్రెసుతోనూ మంతనాలు జరిగినట్టు పుకార్లు వినిపించాయి. తమ కుటుంబానికి ఆప్తుడైన పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడానికి ఆరాటపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె ప్రయత్నాలేమీ ఫలించలేదు. వామపక్షాల విషయంలో వారి ఆఫీసుకు వెళ్లి.. అక్కడే వారి మీద విమర్శలు చేసి దూరమయ్యారు షర్మిల.
ఈ రకంగా అన్ని ప్రయత్నాలూ విఫలం అయ్యాక.. ఇప్పుడు తాను ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోబోయేది లేదని ఆమె చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వారందరూ వద్దని ఆమె అంటుండవచ్చు గానీ.. నిజానికి, ఆమె స్నేహహస్తాన్ని వారందరూ తిరస్కరించిన తర్వాత మాత్రమే ఈ మాటలు వస్తున్నాయి. ఇలాంటి ప్రగల్భాలు మానుకుని పార్టీని క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల అయినా బరిలోకి దిగగలిగేలా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆమెకుందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles