పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో కచ్చితంగా ప్రభావశీలమైన నాయకుడు. ఆయన భారత రాష్ట్ర సమితిని విడిచి బయటకు వచ్చారు. కొన్ని నెలలుగా కేసీఆర్ మీద, ఆయన అనుయాయుల మీద ఎడాపెడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో జిల్లా అంతటా తన అనుచరులను అభ్యర్థులుగా నిలబెడతానని డాంబికమైన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యం అంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తాను ఏ పార్టీ తరఫున కేసీఆర్ మీద యుద్ధభేరీ మోగించదలుచుకుంటున్నారో ఇప్పటిదాకా తేల్చుకోలేదు. ధన వనరుల పుష్కలంగా సమకూర్చగల పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏ పార్టీ అయినా అక్కున చేర్చుకోవచ్చు గాక! కానీ, ఏ పార్టీ అనేది తేల్చుకోకుండా ఆయన సాగిస్తున్న సమరం, గాల్లో కత్తి తిప్పుతున్నట్లుగా ఉంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఒకప్పట్లో చాలా సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మొదటిసారి ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాతి పరిణామాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంత వేగంగా పార్టీ మారారో.. అంత వేగంగా ఆ పార్టీలో ఆయన కెరీర్ కి తెరపడిపోయింది. కేసీఆర్ ఆయనను లూప్ లైన్ లో పెట్టారు. ఇన్నాళ్లూ వేరే గత్యంతరం లేనట్టుగా దానిని భరిస్తూ.. అక్కడే కొనసాగిన పొంగులేటి ఇప్పుడు బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పతనాన్ని శాసిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
ఖమ్మం నియోజకవర్గం స్థాయిలో గతంలో ఎంపీగా చేసిన నాయకుడు గనుక.. అక్కడ తనకు అనుచరబలం ఉండడం విశేషం కాదు, సంపద పరంగా ఎంతయినా ఖర్చు పెట్టగల నాయకుడే కావొచ్చు, కానీ కేసీఆర్ ను ఓడించాలంటే మొత్తంగా తెలంగాణ మీద ప్రభావం చూపించాలి కదా అనేది ఒక ప్రశ్న. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ లోకి వెళ్తారనేది తేలలేదు.
కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో యుద్ధం సాగిస్తున్న బిజెపి కూడా ఆయనను అక్కున చేర్చుకుంటుంది. కానీ ఆపార్టీలో తను చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకోవాలంటే.. కనీసం ఖమ్మం జిల్లా వరకు అయినా సరే.. తను చెప్పిన ప్రతి ఒక్కరికీ టికెట్లు ఇవ్వాలంటే సాధ్యమయ్యే సంగతి కాదు. కాంగ్రెసులోకి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే.. కనీసం ఖమ్మం జిల్లాలో కూడా ఆ పార్టీలో ఏకధ్రువ నాయకుడిగా పొంగులేటి చెలామణీ కావడం కష్టం.
ఇక తనకు వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం బట్టి.. షర్మిల స్థాపించిన వైతెపాలోకి కూడా వెళ్లవచ్చు. అయితే.. పొంగులేటి చేరిక ఆ పార్టీకి ఉపయోగపడవచ్చు గానీ, ఆ పార్టీ పొంగులేటికి ఎంత మేర ఉపయోగపడుతుందనేది సందేహం. ఏపార్టీలో చేరితో ఆయనకు ఏం ఆఫర్లు లభిస్తాయి, అందుకు ప్రతిగా ఆయన ఏమేం ఆఫర్లు చేయాల్సి వస్తుందనే డీల్ ఇంకా తెగలేదని.. అందుకే ఆయన ఉత్తుత్తినే కేసీఆర్ వ్యతిరేక మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.