ఏ అర్హతతో కాంగ్రెస్ ఈ మాట అంటోందో?

Monday, December 23, 2024

జాతీయ పార్టీలకు లోక్‌సభలో తమ బలం పుష్కలంగా ఉండాలనే కక్కుర్తి సహజం. అందుకోసం తాము పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను తొక్కేసి, ఎంపీ సీట్లలో మాత్రం దండిగా తామే పోటీ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ దామాషాలో అసెంబ్లీ సీట్లను ఆయా ప్రాంతీయ పార్టీలకు వదిలిపెట్టే అవకాశం ఉంటుందా అంటే అదీ లేదు. విన్ విన్ పాలసీ లాగా అసెంబ్లీలో మీరే రాజ్యమేలండి.. లోక్ సభను మాకు వదిలిపెట్టండి అనే తరహాలో జాతీయ పార్టీల పొత్తు బేరాలు కొండొకచో సాగుతుంటాయి. కానీ, ఈ సాంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చింది. తమ బలాన్ని నిరూపించుకునే యోగ్యత, అర్హత లేకపోయినా.. పొత్తుల్లో ఉన్న పార్టీ సీట్లను కబళించాలని చూస్తోంది.

మోడీ ప్రభుత్వాన్ని కూల్చడం ఒక్కటే లక్ష్యంగా 26 పార్టీలను గుంపుగా చేర్చి ఏర్పాటు చేసిన ఇం.డి.యా. కూటమిలో తొలి లుకలుకలను కాంగ్రెస్ ప్రారంభిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏలుబడి లో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలోని ఏడు లోక్సభ ఎంపీ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తుందని వారు ప్రకటించారు. ఢిల్లీ పరిధిలోని ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఒక ఉన్నత స్థాయి పార్టీ సమావేశం తరువాత ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు బంధం కొనసాగిస్తూనే ఢిల్లీలో కాంగ్రెస్ ను మించి ప్రాబల్యం ఉన్న ప్రజాదరణ ఉన్న ఆ పార్టీని నామమాత్రంగానైనా సంప్రదించకుండానే తమంత తాము అన్ని స్థానాలలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది.

కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఇం.డి.యా. కూటమిలో కొనసాగాల్సిన అవసరం తమకు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రకటించారు. ముంబైలో జరగాల్సి ఉన్న ఇండియా కూటమి మూడో భేటీకి తమ పార్టీ అసలు హాజరు కావాలా వద్దా అనే సంగతిని అధినేత నిర్ణయిస్తారని కూడా వారు చెబుతున్నారు. ఢిల్లీ పరిధిలో కాంగ్రెస్ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ బలం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆప్ ఏలుతున్న ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం సున్నా. ఆ ఏడు ఎంపీసీట్లలోనూ ఒక్కటీ కాంగ్రెస్ చేతిలో లేదు. అయినా సరే వారు నూటికి నూరుశాతం సీట్ల మీద ఆశపడుతున్నారు. సీట్లను ఆప్‌తో పంచుకోవడం గురించి కాంగ్రెస్ చర్చించను కూడా లేదు. అలాగని ఉన్న ఏడు స్థానాలను మొత్తంగా తామే కోరుకుంటున్నట్లయితే అందుకు ప్రతిగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం ఎంపీ సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయిస్తారా అనేది కూడా చర్చలోకి వస్తోంది. మొత్తానికి మోడీని గద్దె దించడానికి పూనుకుని ఏర్పాటుచేసిన కూటమి అనైక్యత కారణంగా భ్రష్టు పట్టిపోయేందుకు కాంగ్రెస్ స్వయంగా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles