ఏపీ మంత్రులకు హరీష్ రావు సవాల్!

Sunday, December 22, 2024

ఏపీలో అభివృద్ధి లేదని, కడుపు చేత పట్టుకొని పనుల కోసం హైదరాబాదుకు వలస వచ్చిన కూలీలు తమ ఓటు హక్కును కూడా ఇక్కడే పెట్టుకుని స్థిరపడడం మంచిదని అన్నందుకు తెలంగాణ మంత్రి హరీష్ రావు మీద… ఆంధ్రప్రదేశ్ మంత్రులు విడతలు విడతలుగా అనేక రకాలుగా విరుచుకు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే! హరీష్ రావు మీద నేరుగా విమర్శలు చేయడంతో పాటు.. తెలంగాణ ప్రజలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ కొత్త వివాదాల్లో ఏపీ మంత్రులు చిక్కుకున్నారు. తెలంగాణ మంత్రులు ఏపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే.. వారికి సమాధానం చెప్పడం ప్రతి విమర్శలు చేయడం కరెక్టే గాని.. తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ కూడా వారికి హితవు చెప్పారు! 

ఇన్ని వివాదాలు నడుస్తుండగా.. తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ఏపీ మంత్రులకు మరో సవాలు విసిరారు. మీకు చేతనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం గురించి పోరాడాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార వైసీపీ రకరకాలుగా నాటకాలు ఆడుతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో.. ప్రత్యేక హోదా కోసం త్యాగం చేస్తున్నామంటూ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించిన, అప్పట్లో హోదా కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించిన.. వైయస్ జగన్మోహన్ రెడ్డి..  తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి పోరాడడం పక్కన పెట్టారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి వినతిపత్రం ఇస్తున్నట్టుగా ఒక ప్రెస్ నోట్ విడుదల అవుతుంది తప్ప క్రియాశీలంగా అధికార పార్టీ- హోదా కోసం చేస్తున్న ప్రయత్నం శూన్యం.

ఇదే విషయాన్ని హరీష్ రావు ఎండగట్టారు. చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ మంత్రులకు సవాలు విసిరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం కూడా తప్పేనా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరి ఈ సవాలు స్వీకరించేంత ధైర్యం, చైతన్యం ఏపీ మంత్రులకు ఉన్నాయా? హోదా గురించి వారి అచేతనత్వాన్ని హరీష్ సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే.. అంతే సూటిగా దానికి జవాబు చెప్పగల తెగువ ఎంత మంది మంత్రులకు ఉంది! డొంక తిరుగుడు ప్రతి విమర్శలతో విరుచుకు పడకుండా.. హరీష్ సవాలును చూసి అయినా సరే తమ వైఖరి గురించి సిగ్గుపడే చైతన్యం ఎంతమందికి ఉంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles