తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ శాఖల మధ్య పనితీరులో ఒక వ్యత్యాసం కనిపిస్తోంది. ఆయా పార్టీల రాష్ట్ర నాయకుల ఆలోచన సరళిని, వక్ర ప్రయోజనాలను స్పష్టం చేసే తేడా అది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకంగా పురమాయించకపోయినా కూడా వారు ప్రభుత్వం మీద నిత్యం పోరాట పథంలోనే ఉంటారు. కానీ ఏపీలో ఆ వాతావరణం లేదు. పార్టీ అధిష్టానం పురమాయించినా కూడా మొక్కుబడిగా సమస్యలు ప్రస్తావించే వాళ్లు తప్ప.. ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించే నేతలు లేరు. అందుకే ఏపీ బీజేపీ నేతలకు జగన్ మీద అవ్యాజమైన ప్రేమానురాగాలలున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రతిపక్షాలు పోరాడుతూ ఉండడం చాలా సహజమైన విషయం. కనీసం అలాంటి పోరాటం కూడా చేయకపోతే ఆ పార్టీలకు మనుగడ ఉండదు. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో లాలూచీ పడిన పార్టీలు అలాంటి ప్రయత్నం చేయవు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాల మీద చార్జిషీట్ విడుదల చేయాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పార్టీ నాయకులను ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆయన స్వయంగా వారినుంచే తెలుసుకుని.. వాటన్నింటిపై చార్జిషీట్ చేయాలన్నారు. వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రధాని ఆ విషయం చెప్పి వెళ్లి చాలాకాలమే గడిచింది. ఇప్పటిదాకా ఆ దిశగా ఏపీ బీజేపీలో ఏమాత్రం చలనం లేదు. ఏదో మొక్కుబడిగా జగన్ సర్కారు మీద ప్రెస్ నోట్లు ఇవ్వడం తప్ప.. గట్టి పోరాటం ప్రకటించింది కూడా లేదు.
అదే సమయంలో అటు తెలంగాణలో బిజెపి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. వారికి ఇలాంటి స్పష్టమైన సూచన ఏదీ లేదు గానీ.. కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జిషీట్ తయారుచేస్తున్నామని, ఏప్రిల్ లో బహిరంగ సభ పెట్టి అమిత్ షా ద్వారా దానిని విడుదల చేయిస్తామని వారు అంటున్నారు.
నిజానికి ఏపీలో అధికారంలోకి వస్తామనేంత నమ్మకం లేకపోయినప్పటికీ.. బిజెపి పెద్దలు ఈక్వల్ గానే ఫోకస్ పెడుతున్నారు. కర్నూలులో బహిరంగ సభకు అమిత్ షా కూడా వస్తున్నారు. అయితే.. ఛార్జిషీట్ తరహాలో ప్రభుత్వ వైఫల్యాల మీద దాడిమాత్రం జరగడం లేదు. సాక్షాత్తూ ప్రధాని మోడీ చెప్పినా కూడా రాష్ట్ర భాజపా నాయకులు పట్టించుకోలేదంటే.. జగన్ మీద అభిమానంలో వారెంతగా కరడుగట్టిపోయారో కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
ఏపీ బీజేపీ.. జగన్ ప్రేమకు ఇది రుజువు కదా?
Wednesday, November 13, 2024