ఈనెల 11వ తేదీన విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదే తరహాలో 12వ తేదీన తెలంగాణలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ఆయన తెలంగాణకు రాబోతున్నారు. ఈ వ్యవహారం గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ తన దృష్టి పెంచుతున్నదనే సంగతి మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి తెలంగాణలో పాగా వేయాలనే కోరిక కమల దళానికి బాగా ఉంది. అక్కడ ప్రారంభోత్సవానికి వస్తూ, ఏపీలో ముఖప్రీతికోసం అన్నట్లుగా ఒక శంకుస్థాపనను కూడా ప్రధాని చేయబోతున్నారు! అది కూడా కేవలం రైల్వే స్టేషన్ విస్తరణ పనులకు..!!
ఇదంతా ఒక ఎత్తు అయితే ‘కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి తెలుగు రాష్ట్రాలకు తొలి నుంచి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది’ అనే సంగతి అందరూ చెబుతున్నదే. తెలంగాణలోని కేసిఆర్ ప్రభుత్వం కూడా ఇటీవల కాలం నుంచి తీవ్ర స్థాయిలో కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తుతూ స్ట్రైట్ గా పోరాటం చేస్తున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధాని రాక కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ప్రజల ఆస్తులను నేలమట్టం చేస్తూ తమ అపరిమితమైన విధ్వంస పాలనను కొనసాగిస్తున్నది.
ఈ పోకడలు ఇలా ఉండగా, వామపక్షాలకు చెందిన కామ్రేడ్లు అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే తెలంగాణలో ఉన్న స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో కనిపించడం లేదు. తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ప్రధాని నరేంద్ర మోడీకి లేదని, ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఆయన తీవ్రమైన అన్యాయం చేశారని రామగుండం ప్రారంభోత్సవానికి వచ్చే తెలంగాణ ప్రధానికి తమ నిరసనను తెలియజేస్తామని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరిస్తున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున నిరసనగళాన్ని తెలియజేయవలసిన బాధ్యత తమకుందని, ఏపీలోని కామ్రేడ్లు మాత్రం గుర్తించడం లేదు. ప్రధాని వస్తున్న సందర్భంలో వారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ప్రధాని పర్యటనను- ప్రసంగాలను ఖండిస్తూ మాటలు చెప్పడం ఎటూ జరుగుతుంది! కానీ, ప్రజల్లో వ్యతిరేకత, నిరసన, అసంతృప్తి, ఉన్నదనే సంగతి క్రియాశీలంగా మాత్రమే వ్యక్తం కావాలి.
మిగిలిన పార్టీలు రాజకీయ ఆలోచనలతో ఎలాగైనా వ్యవహరించవచ్చు గాని, కనీసం కామ్రేడ్లు కూడా సరైన రీతిలో ప్రతిస్పందించకపోతే ప్రజాగళానికి విలువ ఉండదు! తెలంగాణలో తమ పార్టీ నాయకులు ఒక కార్యచరణను భుజానికి ఎత్తుకున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తితో అయినా సరే ఏపీ కామ్రేడ్లు కూడా విశాఖపట్నంకు వచ్చే ప్రధానికి రాష్ట్ర ప్రజల అసంతృప్తిని తెలియజేసే దానికి ప్రయత్నిస్తే బాగుంటుంది!!