ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ కు తాము న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొనడానికి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన ఏపీ కాంగ్రెస్ నాయకులతో చిన్న భేటీ నిర్వహించి ఈ వాగ్దానాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి, విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతిలో రాజధాని నిర్మాణం.. లాంటి అన్ని అంశాలలోనూ కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుంది అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ విషయం రాహుల్ స్వయంగా మీడియాకు చెప్పకపోయినప్పటికీ, ఆయనతో భేటీ తర్వాత ఏ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించడం గమనార్హం.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి మడత పేచీలు పెట్టకుండా రాహుల్ గాంధీ అందుకు సహకరిస్తారా అనేది అనుమానం. ఎందుకంటే ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం కావచ్చు ఏపీకి సంబంధించి ఎంత గొప్ప హామీ ఇచ్చినా సరే, కేవలం ఆ హామీని నమ్మి ప్రస్తుతానికి ఆ పార్టీని ఏపీ ప్రజలు ఆదరిస్తారని అనుకోవడం భ్రమ. ఇన్ని హామీలు చెప్పినంత మాత్రాన 2024 ఎన్నికల్లో కాంగ్రెసుకు ఒక్క సీట్ అయినా దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పూర్తిగా పరాజయం పాలై.. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ హామీలను నిలబెట్టుకోవడానికి రాహుల్ సిద్ధంగానే ఉన్నారా అనేది ప్రజల అనుమానం.
సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే నిర్ణయం తీసుకునే వాళ్ళమని, ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిర్ణయం తీసుకునే వాళ్ళమని కొత్త మడత పేచీలు పెట్టకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉంటారా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది. ఈ ఎన్నికలకు కాకపోయినా ఆ తర్వాతే ఎన్నికల నాటికి అయినా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కాస్త జవసత్వాలు కూడగట్టాలంటే కాంగ్రెస్ బేషరతుగా ఈ హామీలు నెరవేర్చాలి. తాము అధికారంలోకి వస్తే చేస్తాం అనడం కాదు- రాకపోయినా సరే పార్లమెంటులో గట్టిగా పోరాడి ఏపీ పట్ల తమ శ్రద్ధను నిరూపించుకోవాలి. అమరావతి రాజధాని గురించి, పోలవరం గురించి.. గత తొమ్మిదేళ్లలో రాహుల్ పార్లమెంటులో ఎన్నిసార్లు తాను సొంతంగా గళం వినిపించి తమ విధానాన్ని ప్రకటించారో ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏపీలో అడుగుపెట్టినప్పుడు ఈ కబుర్లు చెప్పడం కాదు.. పార్టీగా తమ విధానం అదేనని చేతల్లో నిరూపించుకోవాలి. లేకపోతే కాంగ్రెసును తెలుగు ప్రజలు ఎప్పటికీ నమ్మరు- అనే సంగతి రాహుల్ గాంధీ, ఆయన అనుచరగణం తెలుసుకోవాలి.