స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో అయిదు ఏకగ్రీవం అయ్యాయి. మరో నాలుగు స్థానాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థులు రంగంలో నిలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుచుకునే అవకాశాలే ఉన్నాయి. వారికే మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల మీద దృస్టి పెట్టనేలేదు. మిన్నకుండిపోయింది. ప్రతిచోటా స్వతంత్ర అభ్యర్థులు మాత్రం నామినేషన్లు వేశారు.
ఈ స్వతంత్ర అభ్యర్థులందరినీ బెదిరించి, ప్రలోభపెట్టి విత్ డ్రా చేయించడం ద్వారా అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. నిజానికి ప్రలోభాల పర్వం దాకా రాకుండా.. అధికారుల మీద పెత్తనం చేయడం ద్వారా.. వారి నామినేషన్లనే తిరస్కరింపజేసేలా కొన్ని చోట్ల చక్రం తిప్పారు. అంతకంంటె ముందు దశలో అసలు నామినేషన్లు వేయకుండానే అభ్యర్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకు రకరకాల మాయోపాయాలు పన్నారు. జేసీ సోదరుల మద్దతుతో వారి అనుచరుడు అనంతపురంలో నామినేషన్ వేస్తే ప్రతిపాదించిన వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉన్నదంటూ తిరస్కరించారు. నానా కష్టాలు పడి నామినేషన్ వేసిన ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దాంతో ఆ స్థానం ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవాలు అయిన ప్రతిచోటా ఇలాంటి దందాలే. బెదిరింపులు, ప్రలోభాలే! అయితే నాలుగు చోట్ల మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు స్వతంత్ర అభ్యర్థులు కొరుకుడు పడలేదు. వెస్ట్ గోదావరి లో రెండు స్థానాలుంటే.. అక్కడ నలుగురు స్వతంత్రులు రెండింటికీ పోటీలో నిలిచారు. దీంతో పోటీ తప్పడం లేదు. శ్రీకాకుళంలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అయితే ఆదివారం నుంచి ఆయన ఎవ్వరికీ అందుబాటులో లేకుండాపోయారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేవరకు ఆయన ఫోను కూడా స్విచాఫ్ లో ఉండిపోయింది. ఆయన కోసం రకరకాలుగా ప్రయత్నించిన వైసీపీ నాయకులు నిరాశతో ఊరుకోవాల్సి వచ్చింది. అలాగే కర్నూలులో కూడా స్వతంత్రులు వెనక్కు తగ్గలేదు. ఈ నాలుగు స్థానాలకు 13న పోలింగ్ జరగబోతోంది.
ఎన్నిక జరిగినా సరే.. ఎటూ అధికార పార్టీ మాత్రమే గెలుస్తుంది. అయినా సరే.. వారు ఎందుకింత తాపత్రయపడుతూ, ఆరాటంగా ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నట్టు? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే, స్థానిక సంస్థల ప్రతినిధులనుంచి అధికార పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా గుసగుసలున్నాయి. సర్పంచిల నిధుల కాజేశారని, అసలు స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎలాంటి పని, అధికారాలు, నిధులు లేకుండా చేసేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారిలో ప్రబలంగా ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో బయటపడుతుందనే ఉద్దేశంతో.. అతి జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ ఏకగ్రీవాలకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఏకగ్రీవాల వెనుక బెదిరింపులు, దందాల ఘోరాలే!
Monday, December 23, 2024