ఏం జరుగుతోంది.. ఏపీ నుంచి పరిశ్రమల వలస!

Wednesday, January 22, 2025

ఏ పార్టీ అయినా సరే.. యువతరాన్ని ఆకర్షించి అధికారంలోకి రావాలని అనుకుంటుంది. యువత మీద ఫోకస్ పెట్టడానికి ప్రత్యేకమైన ప్రేమ కాదు. యువతరం ఒకసారి కనెక్ట్ అయితే మరికొన్ని దశాబ్దాల పాటు తమ పార్టీని ప్రేమిస్తూనే ఉంటారనే వ్యూహం. పార్టీలు ఎన్నికల సమయంలో ప్రధానంగా యువతరాన్ని ఆకట్టుకోవడానికి ఉద్యోగాల కల్పన అనే ఆశ పెడుతుంటాయి. అధికారంలోకి వస్తే గనుక.. అందరికీ ప్రభుత్వోద్యోగాల కల్పన సాధ్యం కాదు కాబట్టి.. పెద్ద సంఖ్యలో పరిశ్రమలను తమ రాష్ట్రానికి తీసుకువచ్చి ఆ రూపంలో యువతకు ఉద్యోగాలు కల్పించి.. తమ మాట నిలబెట్టుకున్నట్టు ప్రచారం చేసుకుంటాయి.  అందుకే ఎవరైనా వచ్చి పరిశ్రమ పెడతాం అనగానే.. రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాయి. వారు అడిగిన వసతుల్నీ కల్పిస్తాయి. రాయితీలు ఇస్తాయి. మొత్తంగా పరిశమ్ర తమ రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా చూస్తాయి. ఉపాధితో పాటు, ఆ పరిశ్రమ ఉత్పత్తుల మీద పడే పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీగా లాభం వస్తుందనే ఆశ కూడా ఉంటుంది. 

అయితే జగన్ రెడ్డి పాలన తీరే వేరు. ఆయన పరిశ్రమలను తీసుకురారు. పైగా ఉన్నవాటిని కూడా వెళ్లకొడతారు. ఏపీనుంచి గుట్టు చప్పుడు కాకుండానూ, రచ్చరచ్చ అయి వార్తల్లో నిలుస్తూనూ అనేకానేక సంస్థలు పలాయనం చిత్తగించిన తర్వాత ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది. దాదాపు 9500 కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి కల్పించగల సంస్థ ఇప్పుడు తెలంగాణకు వలస వెళ్లింది. 

జగన్ సీఎం కాగానే విశాఖలో రాజధాని వస్తుందని.. అక్కడే ప్రత్యేకంగా ఐటీ కోసం కట్టించిన భవనాలలోని ఐటీ పరిశ్రమలను ఖాళీ చేయించారు. ఆ ఐటీ సంస్థలు ఏకంగా రాష్ట్రం నుంచే వెళ్లిపోయాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇదంతా జరిగిపోయింది. హీరో సంస్థ రాలేదు. కియా సంస్థ లోకల్ ఎంపీ వేధింపులకు తట్టుకోలేక వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, ఇప్పటికే ప్రొడక్షన్ కూడా ప్రారంభమైనందున గతిలేక కొనసాగుతోంది. జాకీ సంస్థ వైసీపీ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక తరలిపోయిన సంగతి వార్తల్లో చూశాం. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన పరిశ్రమ గనుక.. అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేయడంతో.. వారు కూడా తమ కొత్త యూనిట్ ఆలోచనను తెలంగాణకు తీసుకువెళ్లారు. 

జగన్ పాలన దెబ్బకు రాష్ట్రంనుంచి పరిశ్రమలు వలస వెళుతున్నాయి. రాను రాను ప్రజలు కూడా వలస వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని, ఈ రాష్ట్రంలో ఉండలేని రోజులు వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles