ఎవరి ఎజెండాలు వారివి: ఇంకేం ఐక్యత!

Sunday, December 22, 2024

భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించడానికి ప్రతిపక్షాలు అన్నింటినీ ఒక్కతాటిమీదకు తేవాలని బీహార్ ముఖ్యమంత్రి కంటున్న కలలు అంత సులువుగా నెరవేరుతాయా? అనే అనుమానాలు ఇప్పుడు పుడుతున్నాయి. విపక్షాల మద్య ఐక్యత పురిట్లోనే సంధి కొట్టడం కాదు కదా.. అసలు ఐక్యతకోసం జరుగుతున్న సమావేశానికి ముందే.. వారి మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. విపక్ష పార్టీల్లో ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అసలు విపక్షాలు అందరూ ఐక్యగానం చేయడం అసాధ్యం అనే అభిప్రాయం వినిపిస్తోంది.

23వతేదీ శుక్రవారం నాడు నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల బృహత్ సమావేశం షెడ్యూలు చేశారు. ఇప్పటికే ఒకసారి ముహూర్తం పెట్టి.. కొన్ని పార్టీలు కలసి రాకపోవడంతో.. తేదీని మార్చారు నితీశ్ కుమార్. కాంగ్రెసు తరఫునుంచి రాహుల్ కూడా ఉండాలనే ఉద్దేశంతో తేదీ మార్చారు. అయితే సరిగ్గా సమావేశం జరగాల్సి ఉన్న ఒక్కరోజు ముందు పార్టీలు తమ సొంత ఎజెండాలను బయటకు తీస్తున్నాయి. ఈ సమావేశానికి మేం రాబోం అని ప్రకటిస్తున్నాయి. నితీశ్ ఏర్పాటుచేసిన విపక్షాల సమావేశానికి రాబోయేది లేదని ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా ఉండే బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ప్రకటించారు. దేశ ప్రధాని ఎవరనేది డిసైడ్ చేయడంలో కీలకంగా ఉండే యూపీ రాజకీయాలను, పార్టీలను విపక్ష కూటమి విస్మరిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. ఆ రకంగా మాయావతి కూటమినుంచి ముందే జారుకున్నారు. కాగా కేజ్రీవాల్ విపక్ష పార్టీల ముందు తన సొంత ఎజెండాను బయటపెట్టి.. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వంలో అధికార్ల బదిలీలకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు అన్నీ తమ వైఖరిని స్పష్టం చేస్తే తప్ప.. ఆ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తే తప్ప తాను భేటీకి రానని, కేజ్రీవాల్ ప్రకటించేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్సు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది కరమైనది కావడంతు ఆయన దానికి వ్యతిరేకంగా దేశమంతా తిరుగుతూ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. తన గోడు పట్టించుకోకుండా విపక్షాల భేటీ పెడుతుండే సరికి ఆయనకు కోపం వచ్చింది. ఆర్డినెన్సను కాంగ్రెస్ చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తే తప్ప భేటీకి రానని చివరి నిమిషంలో భీష్మించుకున్నారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విపక్షాల ఐక్యతకు ముందునుంచీ షాకులు ఇస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెసు పార్టీ సీపీఎంతో కలసి పనిచేసినంత కాలం.. విపక్షాల ఐక్యత గురించి అసలు తనను సంప్రదించనే వద్దని దీదీ అంటున్నారు. కాంగ్రెస్- వెస్ట్ బెంగాల్ లో సీపీఎంను విస్మరించి రాజకీయం చేయడం అనేది కుదిరే పని కాదు. అలాగే.. సీపీఎంతో సఖ్యంగా ఉండడం మమతా బెనర్జీకి తన సొంత రాష్ట్రంలో ఆత్మహత్యా సదృశం అవుతుంది.

ఇలాంటి నేపథ్యంలో విపక్షాల్లో ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయి. కాగా, అసలు ఈ పార్టీల మధ్య ఐక్యత అనేది సాధ్యమేనా అని పలువురు పెదవి విరుస్తున్నారు. వీరి అనైక్యతే బలంగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles