ఇన్నాళ్లు వారిలో ఏ కొంచమైనా గుబులు ఉన్నదేమో తెలియదు. ఇప్పుడు మాత్రం మహా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా వారి మాటల్లో కనిపిస్తోంది. నలుగురు భారాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ బేరసారాలు సాగించిందనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు తాజాగా సీబీఐ చేతిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బిజెపి రెచ్చిపోతున్నది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ఎర కేసును హైకోర్టు సీబీఐకు అప్పగించడం అనేది కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చునని విర్రవీగే వాళ్లకు హైకోర్టు తీర్పు కళ్లు తెరిపించాలని ఆయన అంటున్నారు. సిట్ ఏర్పాటు ద్వారా.. కేసీఆర్ కల్పిత కేసును తాను ఊహించినట్లుగా నడిపించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కూడా ఆరోపణలు చేశారు.
చూడబోతే.. ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ చేతికి వెళ్లడం అంటేనే.. భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఎర కేసులో ఇరుక్కున్న దళారీలకు పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేసినట్టుగా.. రాజకీయంగా తాము పరిశుద్ధులం అయిపోయినట్టుగా బిజెపి ఫిక్సయినట్టు కనిపిస్తోంది. సిట్ చేతినుంచి సిబిఐ చేతికి మారి ఉండవచ్చు గాక.. కానీ విచారణ పర్వం పూర్తి కాకుండానే.. అంతా అయిపోయినట్టు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మాట్లాడడం అనేది.. సీబీఐ వారి విచారణను ప్రభావితం చేస్తుందా అనే అభిప్రాయాలు కూడా పలువురిలో కలుగుతున్నాయి.
ఎమ్మెల్యేలకు ఎర అనే ఫాంహౌస్ ఎపిసోడ్ బయటకు వచ్చిన నాటినుంచి.. చాలా హైడ్రామా నడుస్తోంది. ఈ కేసుపై రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి విచారణ మొదలెట్టింది. బిజెపిలో పెద్దతలకాయలు అనదగిన సంతోష్ వంటి వారికి కూడా వారు నోటీసులు పంపారు. తొలిరోజు నుంచి ఈ కేసులో సిట్ విచారణ తగదని, సీబీఐకు అప్పగించాలని బిజెపి హైకోర్టులో పిటిషన్ వేసి ఎట్టకేలకు నెగ్గింది.
ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలన్నీ రాజకీయాధికారం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతున్నాయనే దురభిప్రాయం ప్రజల్లో ఏర్పడిపోయి ఉంది. దానికి తగ్గట్టుగా.. రాష్ట్ర పోలీసు అధికారులు బిజెపిని ఇరికించే కేసును నమోదు చేశారు. ఇప్పుడు కేంద్రం ఆధీనంలోని సీబీఐ చేతికి వెళ్లగానే బిజెపి వాళ్లు పండగ చేసుకుంటున్నారు. వ్యవహారాలు ఇలా నడుస్తోంటే.. అసలు వ్యవస్థల మీద ప్రజలకు ఎలా గౌరవం ఉంటుంది? అని అంతా అనుకుంటున్నారు. సిబిఐ చేతికి కేసు రాగానే బిజెపి దళాలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటి వాళ్లు రెచ్చిపోవడం, సంతోషించడం అనేది.. ఆ సంస్థ విశ్వసనీయతకే మచ్చ అని ప్రజలు అనుకుంటున్నారు.
‘ఎర’ సిబిఐ చేతికి రాగానే రెచ్చిపోతున్న బిజెపి!
Saturday, November 23, 2024