ఎర్ర పార్టీలను గులాబీ దళపతి నమ్ముతారా?

Friday, January 10, 2025

తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు భారాసకు, వామపక్ష పార్టీల మద్దతు ప్రస్తుతానికి ఉంది. భారాసగా పార్టీని ప్రకటించిన తర్వాత.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా వామపక్షాలు కూడా వారికి పూర్తిగా సహకరించారు. భారాసతో మైత్రీబంధంతోనే రాబోయే ఎన్నికల్లో వామపక్షాలు పోటీచేస్తాయని అప్పటినుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వామపక్షాలు కాస్త వేగిరపడుతున్నాయి. మరో ఆరునెలల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలకు ఏయే సీట్లు కేటాయిస్తారో కేటీఆర్ తో తేల్చుకోవాలని అనుకుంటున్నాయి. అందుకోసం కేసీఆర్ అపాయింట్మెంట్ కు ప్రయత్నిస్తున్నాయి. ఒకటిరెండు రోజుల్లో భేటీ జరిగే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక చర్చనీయాంశం ఏమిటంటే.. వామపక్ష పార్టీలను కేసీఆర్ నమ్మేస్థితిలో ఉన్నారా? అనేది ప్రశ్న! ఎందుకంటే.. కేంద్రంలో భాజపా సర్కారును తుదముట్టించడానికి ఏర్పాటు అయిన విపక్ష కూటమి కేసీఆర్ ను వెలివేసింది. కనీసం ఆహ్వానించను కూడా లేదు. కేసీఆర్ కూడా ఆ కూటమిలో కాంగ్రెస్ ఉన్నట్లయితే తను భాగస్వామి కాలేనని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ సారథ్యంలో ఉండగల ఆ కూటమిలో వామపక్షాలు చాలా కీలకంగానే ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోనే కూటమి ముందుకు వెళ్లాలని జాతీయ స్థాయి వామపక్ష నాయకులు చెబుతూ వస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ స్థానికంగా వామపక్షాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వామపక్ష పార్టీలు ఇప్పుడు కేసీఆర్ మద్దతు ద్వారా అసెంబ్లీ సీట్లు గెలవాలని ఆశపడడం బాగానే ఉంది. మరి ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సహకారాన్ని గులాబీ దళానికి అందిస్తారా? అనేది సందేహం. ఎందుకంటే.. అప్పటికే కాంగ్రెస్ సారథ్యంలో కూటమిగా పోటీచేయడం కన్ఫర్మ్ అవుతుంది. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసు మీద పోరుబాటనే అనుసరిస్తారనేది అందరి అంచనా. కేసీఆర్ కూడా ఆ కూటమిలో చేరి, కాంగ్రెస్ సారథ్యంలో పోరాటానికి ఒప్పుకుంటే.. ఆయన భారాస పార్టీకి అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. ఆ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల సమయానికి వామపక్షాలు తెలంగాణలో ఎవరి జట్టులో ఉంటాయి? అనేది తేలాలి! అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సీట్లు కేటాయించాలంటే.. ముందు, పార్లమెంటు ఎన్నికల్లో వారి వైఖరి ఎలా ఉంటుందనేది తేల్చుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారు.

వామపక్ష నాయకులు.. పార్లమెంటు ఎన్నికల వేళకు జాతీయ కమిటీలు ఎలా నిర్ణయిస్తే అలా వెళ్తామని చెబితే కేసీఆర్ అంగీకరించకపోవచ్చు. అప్పుడు సహకరిస్తాం అని ప్రస్తుతానికి మాట ఇచ్చినా.. గులాబీ దళపతి నమ్ముతారా? లేదా? అని పలువురు అనుమానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles