పాపం వామపక్ష నాయకుడు సిపిఐ నారాయణ ఎట్టకేలకు రుషికొండను సందర్శించారు. అధికారులు ఆయనకు దగ్గరుండి రుషికొండ దర్శన భాగ్యం కల్పించారు. శిరోముండనం చేసిన పిమ్మట మిగిలిన శిఖండికము లాగా.. (అంటే మరేం లేదులెండి.. గుండుకొట్టిన తర్వాత మిగిలిన పిలకలాగా) రుషికొండ మొత్తం దారుణంగా తయారైపోయిందని ఆయన ఒక బొచ్చు పీకిన టెంకాయను విలేకర్లకు చూపించి మరీ.. తన సహజమైన శైలిలో ఎద్దేవా చేశారు. అయితే.. రాష్ట్రప్రభుత్వం రుషికొండలో నిర్మించే భవనాలనుంచే పాలన సాగించడానికి అనువుగా ప్లాన్ చేస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో నారాయణ అనేక రకాలుగా క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. అందుకే కమ్యూనిస్టు నేత అయిన ఆయనను ‘ఎర్ర’ నారాయణ అనుకోవాలో? రుషికొండ నిర్మాణం వద్ద ఉన్న అధికారులు చెప్పిన ప్రతిమాటా నిం అని నమ్మే..అమాయకుడైన వెర్రి నారాయణ అనుకోవాలో? అర్థం కావడం లేదు.
ముఖ్యమంత్రి నివసించే స్థాయి ప్యాలెస్ఇక్కడేమీ లేదు. విలాసవంతమైన గదులు, విల్లాలు, ఫంక్షన్ హాళ్లు, డార్మెటరీలు, సర్వీసు కేంద్రాలు, రెస్టారెంట్లు మాత్రమే నిర్మిస్తున్నారు.. అని నారాయణ సర్టిఫై చేసేశారు. ‘‘చాలా గోప్యత పాటిస్తుండడాన్ని బట్టి.. రుషికొండ నిర్మాణాల్లో ఏదో జరుగుతోందని నేను కూడా అనుకున్నాను.. కానీ ఇక్కడ సీఎం నివసించే స్థాయి నిర్మాణాలు లేవు.’’ అని అంటూనే ‘‘నిజానికి ఇలాంటి రిసార్టులు ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అందమైన రుషికొండను సర్వనాశనం చేశారు. విశాఖ అందమే రుషికొండ.. దానినిన దెబ్బతీశారు.. ఆ అందాన్ని మళ్లీ తిరిగి తీసుకురాగలరా?’’ అని కూడా నారాయణ ప్రశ్నించారు.
అయితే అక్కడ జరుగుతున్న నిర్మాణాలు టూరిజం ప్రాజెక్టు మాత్రమే అంటూ నారాయణ వెల్లడించిన వివరాలు.. నిర్మాణం సైట్ వద్ద ఇంజినీర్లు ఆయనతో చెప్పిన మాటలను తిరిగి ప్రెస్ మీట్ లో అప్పజెప్పినట్టే ఉంది. అంతే తప్ప వారి మాటలపై ఆయన సొంతంగా తన బుర్ర ప్రయోగించినట్టు లేదు. ఎందుకంటే.. విలాసవంతమైన గదులుగా ఆయన చెబుతున్నవి ఉన్నతాధికార్ల ఛాంబర్లుగాను, డార్మెటరీలుగా ఆయన చెబుతున్నవి శాఖా కార్యాలయాలుగానూ రూపుమార్చుకోవడం చిటికెలో పని. అలాంటి లాజికల్ ఆలోచన కూడా చేయకుండా.. ఈ ఎర్ర నాయకుడు సర్టిఫై చేయడమే తమాషా.
నిజానికి రుషికొండ దర్శనభాగ్యం కోసం నారాయణ చాలా కష్టాలుపడ్డారు. గతంలో ఆయన వెళ్తే అనుమతించలేదు. హైకోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా మూడునెలలు కాలయాపన జరిగిందే తప్ప.. అధికార్లు రానివ్వలేదు. ఈలోగా ఆయన అమెరికా వెళ్లిన తర్వాత.. ఫోనుచేసి రమ్మని పిలిచారు. తాను రాలేనని తెలిసే పిలిచారని ఆగ్రహించిన నారాయణ ఇండియా రాగానే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసిన తర్వాత గానీ.. అధికార్లు దిగిరాలేదు. ఆయనను అనుమతించి.. రుషికొండ నిర్మాణాలను దగ్గరుండి చూపించారు. ఎక్కడెక్కడ కడుతున్నది ఏయే భవనమో ఆయనకు వివరించారు. వారు చెప్పిన మాటలన్నిటినీ నారాయణ విని, అవే నిజమని అనుకున్నట్లుగా కనిపిస్తోంది.