ఎమ్మెల్సీ రిజల్ట్స్ : ఒక సెగ్మెంటులో సమాధి కట్టినట్టే!

Wednesday, January 22, 2025

18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఒత్తిడికి గురయ్యారో ఎవరికీ తెలియదు గానీ.. చాలా కంగారు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గతంలో తాను ఎవరెవరికి చాలా స్ట్రాంగుగా మాట ఇచ్చారో ఆ సంగతిని కూడా మర్చిపోయారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సమయంలో ఆయన కళ్లెదురుగా కులాల లెక్కలు తప్ప మరొక సంగతి కనిపించినట్లుగా లేదు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెనుకబడ్డ కులాలకు న్యాయం చేశానని చెప్పుకోవడం ఒక్కటే ఆయనకు ప్రాధాన్యం అయినట్లుంది.  ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని నియోజకవర్గాలలో,  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో, పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీసే విధంగా తయారయ్యాయి.  అలాంటి నియోజకవర్గాలలో ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా ఒకటి.
 శ్రీకాళహస్తి నియోజకవర్గం లో,  తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ సి వి నాయుడు ఆ తర్వాత పరిణామాలలో తెలుగుదేశం పంచన చేరగా,   గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనను తన పార్టీలోకి చేర్చుకున్నారు.  ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని నమ్మబలికారు.  కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీవీ నాయుడు అప్పటినుంచి..  ఇదిగో అదిగో ఎమ్మెల్సీ కాబోతున్నాం అనుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే  పని చేస్తున్నారు.  ఇప్పుడు ఒకేసారి 18 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్న తరుణంలో..  తనకు ఛాన్స్ తప్పకుండా వస్తుందని ఆయన అనుకున్నారు.  అయితే నిరాశ తప్పలేదు.  ఇచ్చిన  18 సీట్లలో,  కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క మర్రి రాజశేఖర్ కు మాత్రమే అవకాశం లభించింది.  కులాల ప్రాధాన్యం అంతా బీసీల వైపు ఉండడంతో ఎస్సివి కి ఛాన్స్ దక్కలేదు.  జరిగిన పరిణామాలు ఇంతే అయితే గనుక ఆయనకు నచ్చచెప్పడం సాధ్యమయ్యే దేమో!
కానీ,  నిన్నటిదాకా తెలుగుదేశం రాజకీయాల్లో ఉంటూ,  నారా లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొనిన  సిపాయి సుబ్రమణ్యంను  రాత్రికి రాత్రి అక్కడ రాజీనామా చేయించి,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని,  కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కట్టబెట్టారు.  తనకు రాకపోవడం ఒక ఎత్తు అయితే,  సిపాయి సుబ్రహ్మణ్యానికి టికెట్ రావడం అనేది,  ఎస్సీవీ నాయుడుకు పుండు మీద కారం రాసినట్లుగా ఉంది.  ఆయన ప్రస్తుతం జగన్ మాట తప్పిన తీరు మీద ఉడికి పోతున్నారు.
 శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంటుంది.  అక్కడ తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పల్లె రెడ్లు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య కుటుంబం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వదిలిపెట్టి తెలుగుదేశం లోకి వచ్చింది. . కాబట్టి ఆ కులాన్ని భర్తీ చేయాలని అనుకున్నారేమోగానీ,  అదే కులానికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా పార్టీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.  ఈ కులాలను లెక్కలు చూసుకోవడంలో పార్టీని నమ్ముకుని ఐదేళ్లుగా సేవలందిస్తున్న ఎస్సీవీ నాయుడుకు మొండి చెయ్యి దక్కింది.  దీంతో ఆయన సహా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కమ్మ సామాజిక వర్గం మొత్తం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.  ఈ కులాల లెక్కల నిర్ణయాలలో ఒక సెగ్మెంట్లో విజయావకాశాలకు గండిపడినట్టుగా తయారైందని పార్టీ వారే వాపోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles