రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా వంటి ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికార పార్టీ పరం అయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే.. పట్ఠభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి స్థానాలు ఏకపక్షంగా జరిగే అవకాశం లేదు. అందుకే విపక్ష పార్టీలు కూడా అంతో ఇంతో ఫోకస్ పెడుతున్నాయి. అయితే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో, కీలకమైన జనసేన పార్టీ మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తోంది. తాము పోటీచేయడం లేదు సరికదా, ఎవరికి మద్దతిస్తున్నామో కూడా ఆయన ఇప్పటిదాకా బయటపడలేదు.
ఒకవైపు.. జనసేనతో మా పొత్తుబంధం పదిలంగా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు తమ పార్టీకే అని ఏకపక్షంగా ప్రకటించేసుకుంటూనే ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి తమ అభ్యర్థి.. తమ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే.. అలాంటి దాఖలాలు ఆచరణలో కనిపించడంలేదు. బిజెపి అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు.. కనీసం జనసేన స్థానిక నాయకుల్ని వెంటబెట్టుకుని వెళ్లడం వంటి పనులు కూడా చేయలేదు. జనసేనతో ఒకవైపు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూనే మరోవైపు ఓట్లు దండుకోవాల్సి వచ్చేసరికి.. జనసేన మాతో పొత్తుల్లోనే ఉన్నది అని బిజెపి చెప్పుకుంటోంది.
వారు ఎలా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ జనసేన ఆ మాటలను పట్టించుకోవడం లేదు. అలాగని ఆయన బయటపడలేదు. తాము ఫలానా పార్టీకి మద్దతిస్తున్నాం అని అనడం లేదు. పట్టభద్ర స్థానాల్లో సీరియస్ గానే తలపడుతున్న తెలుగుదేశం తాజాగా జనసేన మద్దతుకోసం ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే జనసేన పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వకూడదనే పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అందుకు పార్టీ వర్గాలు సహేతుకమైన కారణాలను కూడా చెబుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటొచ్చీ వైసీపీ పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా. బీభత్సంగా దొంగఓట్లను నమోదు చేయించి ఇప్పటికే అవకాశాలను పదిలంగా మార్చుకున్నట్టు ప్రచారం ఉంది. అదే నిజమైతే పట్టభద్ర సీట్లు వాళ్లే గెలుస్తారు. ఉపాధ్యాయ సీట్లలో వైసీపీకి అంత సీన్ లేదు. వామపక్ష మద్దతున్న యూనియన్ల ప్రతినిధులు గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు.. ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశానికి మద్దతిస్తే.. ఓడిపోతే గనుక.. పొత్తుబంధం సాధించేదేమీ ఉండదనే హేళనాత్మక ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని.. అదే సార్వత్రిక ఎన్నికలైతే.. రాష్ట్రప్రభుత్వం పెత్తనం లేని నిష్పాక్షిక ఎన్నికలు అవుతాయి గనుక.. అప్పుడే ఒకేసారి తమ పొత్తుల గురించి బయటపెట్టవచ్చునని పవన్ తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైలెంట్ గా ఉండిపోయి, ఈ పర్వం మొత్తం పూర్తయిన తర్వాత పొత్తుల ప్రకటన చేస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైలెన్సే పవన్ ఆయుధం!
Friday, November 22, 2024