కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బజరంగదళ్ వంటి ఉగ్రవాద సంస్థలను రాష్ట్రంలో నిషేధిస్తాం అని ప్రకటించిందో లేదో.. తమ ప్రచారంలో లడ్డూలాంటి అస్త్రం దొరికినట్టుగా భారతీయ జనతా పార్టీ రెచ్చిపోయింది. అదే మొదలుగా.. హనుమంతుడి పార్టీని నిషేధించాలనే ఆలోచన ద్వారా కాంగ్రెస్ ద్రోహానికి పాల్పడుతున్నదని బిజెపి మహాప్రచారం చేసింది. హనుమంతుడంటే మీకెందుకు కక్ష అంటూ ప్రధాని నరేంద్రమోడీ చాలా నాటకీయమైన డైలాగులతో ప్రచారాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు. అయితే కన్నడ ప్రజల ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు. ప్రచారంలో ఈ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలకు బుట్టలోపడిపోకుండా.. వారు తిప్పికొట్టారు. కన్నడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించడం అసాధ్యం అని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం కట్టబెట్టాయి. రెండు సంస్థలు భాజపాను తొలిస్థానంలో నిలబెట్టాయి. అయితే ఒకటి, రెండు స్థానాల్లో నిలిచే పార్టీల మధ్య వ్యత్యాసం సింగిల్ డిజిట్ లోనే ఉండడం గమనార్హం. అదే సమయంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కు దాదాపుగా అన్ని సర్వేలు కనీసం ఇరవై సీట్లు దక్కేలా ఫలితాలు వెల్లడించడం విశేషం.
స్తూలంగా గమనించినప్పుడు.. కన్నడ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ జీన్యూస్ వారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పలేదు. కానీ.. ప్రజల్లో మాత్రం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శషబిషలు లేకుండా ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే,.. దక్షిణాదిలో తమ పార్టీ అస్తిత్వం కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ పడిన కష్టం మొత్తం వృథా అయిపోయినట్లుగా కనిపిస్తోంది. హనుమాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంగా మోడీ ఈ ఎన్నికల్లో ప్రయోగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చిన నాటినుంచి.. ప్రతి సభలోను కాంగ్రెస్ పార్టీ హనుమద్వేషి అనే ప్రచారంతోనే సాగారు. హనుమంతుడి సెంటిమెంట్ ఎక్కువ వర్కవుట్ అయ్యే కర్ణాటకలో.. హనుమంతుడు పుట్టిన రాష్ట్రంలో ఆయనకు ద్రోహం జరుగుతోందని టముకు వేశారు. అయితే ఈ ప్రయత్నాలేవీ ఆయనకు ఫలితం ఇస్తున్నట్టులేదు. కాంగ్రెస్ అధిక్యం స్పష్టంగా వ్యక్తమవుతోంది.
ఎగ్జిట్ పోల్స్ : హనుమాస్త్రం సక్సెస్ అనుమానాస్పదమే!
Monday, December 23, 2024