ప్రస్తుతం ప్రభుత్వాలు తమ పాలనకు ఎన్నేళ్ల వయస్సు పూర్తయిందో లెక్కలు వేసుకుంటున్న సందర్భం. ఒకవైపు వైఎస్ జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అదే సమయంలో కేంద్రంలో నరేంద్రమోడీ పాలన తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది అసలేమీ లేనేలేదంటూ విమర్శలకు దిగుతున్న కమల నాయకులు తమకు తోచినదెల్లా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో మాత్రమే జరుగుతున్నదిట. రాష్ట్ర ప్రభుత్వాలు అసలు చేసినదేమీ లేదట. కావాలంటే ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి బహిరంగ చర్చకు రావాలని సోము వీర్రాజు వైసీపీ నేతలకు సవాళ్లు విసురుతున్నారు.
సీజనును బట్టి మోడీ తొమ్మిదేళ్ల పాలనను సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో ఉన్న సోము వీర్రాజు ఇలాంటి సవాళ్లు విసరడం చాలా సహజం. అయితే ప్రజలను మాత్రం ఒక సందేహం పట్టిపీడిస్తోంది. కేంద్రప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పథకాల అమలుకు నిధులను అందజేస్తుంటుంది. ఆయా పథకాలకు, ఆయా రాష్ట్రాల దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కూడా నిధులు అందించడం జరిగిందా? లేదా, ప్రత్యేకంగా ఏపీకోసం కేంద్రం ఏమైనా నిధులు అందించిందా? అనేది వారి సందేహం.
కేంద్రం నిధులు అని సోము వీర్రాజు పదేపదే అనడం చిత్రం. ఎందుకంటే.. రాష్ట్రాలనుంచి పన్నులు వసూళ్లు కాకుండా కేంద్రం తామేదో జేబులోంచి రాష్ట్రాలకు డబ్బులివ్వడం జరిగే పని కాదు. ఏపీనుంచి పుచ్చుకుంటున్న పన్నులు, అందిస్తున్న నిధుల మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నదో సోము వీర్రాజు చెప్పాలి. అందరికీ ఇచ్చేది మనకు కూడా ఇచ్చి ఏదో తవ్విపెట్టినట్టుగా గప్పాలు కొట్టుకోకుండా.. ఎక్స్‌క్లూజివ్ గా ఏపీ కోసం కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చి ఉన్నట్లయితే వాటిమీద, సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నట్టుగా బహిరంగచర్చ పెట్టుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ సర్కారు ఏ స్థాయిలో వంచించిందో అందరికీ తెలుసు. దాని గురించి మాటెత్తే ధైర్యంలేని సోము వీర్రాజు.. రాష్ట్రంలో ఏం జరిగినా సరే.. అదంతా మా ఘనతే అని గప్పాలు కొట్టుకోవడం చాలా చవకబారుతనంగా ఉంది.
‘ఎక్స్‌క్లూజివ్ ఏపీ’… ఒక్కమాటైనా చెప్పగలరా?
Friday, November 22, 2024