ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తే అయ్యో అనిపిస్తోంది. జాలేస్తుంది. సుమారు పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా.. కృష్ణారామా అనుకుంటూ కాలం గడుపుతున్న ఈ నాయకుడికి ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా రాజకీయ వాంఛలు పుట్టుకొచ్చినట్టున్నాయి. మంచిదే.. ఇన్నాళ్లుగా అటకెక్కి తుప్పుపట్టిపోయిన ఆయన రాజకీయ జీవితం కాస్త ఆయిలు పట్టి సరిచేస్తే మళ్లీ దార్లోకి వస్తుందేమో అని ఎవరైనా నమ్ముతారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీని నమ్ముకోవడం గమనిస్తే ఆయన కెరీర్ మాత్రమే కాదు బుర్ర కూడా తుప్పు పట్టిపోయిందేమో అనిపిస్తుంది. రాజకీయంగా సెకండిన్నింగ్స్ ఆడదలచుకున్న ఈ అద్భుతమైన రంజీ క్రికెటర్.. ఎందుకూ కొరగాని, ఒక్క ఆటగాడైనా ఫామ్‌లో లేని జట్టులు ట్వెల్త్ ప్లేయర్ గా చేరాలని అనుకోవడమే తమాషా!
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వేరే పార్టీల్లో ఎక్కడా ఎంట్రీ దొరక్క బిజెపిలోకి వెళుతున్నారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. నిజానికి నల్లారి బిజెపి తీర్థం సంగతి చాలాకాలం ముందునుంచి ప్రచారంలో ఉంది. అప్పట్లో నిజంగానే.. పార్టీ ఏపీలో కాస్త జవసత్వాలు పుంజుకునే ఆలోచనతో, ప్రయత్నంలో ఉంది. అప్పట్లో కిరణ్ వచ్చి ఉంటే పార్టీకి ఏమైనా మేలు ఉండేదేమో. కానీ ఎందుకో అప్పుడు కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాతి కాలంలో కూడా ఏపీ బాగు కోసం కేంద్రం వీసమెత్తు ప్రయత్నం చేయకుండా, ప్రత్యేకహోదా విషయంలో మోసానికి పాల్పడి, రైల్వేజోన్ వంటి హామీల విషయంలో కూడా నాటకాలు ఆడుతూ .. రాష్ట్రంలో మరింతగా ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంది.
తాజాగా రాజకీయాల్లోకి మళ్లీ రాదలచుకున్నాక.. కిరణ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీలను ట్రైచేసి ఉండవచ్చు. నిజానికి ఆయన తమ్ముడు ప్రస్తుతం తెలుగుదేశంలో కీలకంగానే ఉన్నారు. కిరణ్ కూడా అటు వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే టీడీపీలోగానీ, జనసేనలో గానీ ఎంట్రీ దొరక్కనే బిజెపిలోకి వస్తున్నారా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఇన్నాళ్లుగా ప్రజలకు దూరంగా ఉండిపోయిన కిరణ్, ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్న బిజెపిలోకి వెళ్లి సాధించేది కూడా ఏమీ ఉండదని పలువురు అంచనా వేస్తున్నారు.
ఎక్కడా ఎంట్రీ దొరక్క కాషాయదళంలోకి!
Thursday, December 19, 2024