175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా కోల్పోయింది. అప్పటికీ ప్రతిచోటా, అయిదో తరగతి చదివిన వారిని కూడా తప్పుడు రికార్డులతో దొంగఓటర్లుగా నమోదు చేయించి.. వారికి ఓటు వేయడం చేత కాని వారితో వేయించికూడా ఓటమి మూటగట్టుకుని వైసీపీ అభాసుపాలైంది. అలాంటిది.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్ల విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో.. టైమ్స్ నౌ- నవభారత్ సర్వే వెల్లడించిన ఫలితాలు పెద్ద కామెడీగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. మోడీ సర్కారు మళ్లీ కొలువు తీరుతుందని టైమ్స్ నౌ తేల్చేసింది. వీరి కూటమికి 292 నుంచి 338 సీట్లు వస్తాయనేది వారి అంచనా. ఏపీ విషయానికి వస్తే 24-25 ఎంపీ సీట్లు జగన్ గెలుస్తారని టైమ్స్ నౌ జోస్యం చెప్పింది.
ఏపీలో ఉన్నదే 25 సీట్లు. 24-25 సీట్లు గెలుస్తారని చెప్పడం అంటే.. నూటికి నూరుశాతం విజయాలు వారికి దక్కుతాయని ప్రకటిస్తున్నట్టే. ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న దాఖలాలు వారికే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకులే అనేక సందర్భాల్లో పరిస్థితులు ఇలాగే ఉంటే మా ప్రభుత్వం మళ్లీ ఏర్పడడం కష్టం అని ప్రెవేటు సంభాషణల్లో చెబుతున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతిచోటా తీవ్రమైన వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. టైమ్స్ నౌ- నవభారత్ సర్వేలో ఒక్కో ఎంపీ నియోజకవర్గానికి ఎంత సాంపిల్ తీసుకున్నారో తెలియదు గానీ.. ఏపీలో నూరుశాతం విజయాల్ని వాళ్లు జగన్ ఖాతాలో వేసేశారు.
కొన్ని సర్వే సంస్థలు ఎన్నికలకు ముందు ఫలితాలు వెల్లడించే విషయంలో పార్టీలకు అమ్ముడుపోతుంటాయి. ఈ సర్వేమీద కూడా ప్రజలకు అలాంటి అనుమానాలు ఏర్పడుతున్నాయని అనలేం. అయితే, వారి సర్వే తీరుమీదనే అనుమానాలు వస్తున్నాయి. లేదా.. ఏపీలో సర్వే అనే పేరుతో ఎవరు వచ్చినా సరే ప్రజలు అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే చెప్పడం అలవాటు చేసుకున్నారా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే.. ‘మా భవిష్యత్తు నువ్వే జగన్’ కార్యక్రమంలో కూడా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి సర్వేచేస్తున్నారు. సర్వేలంటేనే ఏపీ ప్రజలు భయపడే పరిస్థితి. ఎవరి సర్వేలో జగన్ కు వ్యతిరేకంగా చెప్పినా.. ఏకంగా తమ రేషన్ కార్డు కూడా పోతుందని భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సర్వేలో అనుకూల ఫలితాలు వచ్చాయా? లేదా, జగన్ వంటి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనకు ప్రీతికరంగా ఉండడానికి టైమ్స్ నౌ ఇలాంటి ఫలితాలను వండి వార్చిందా? అనేది అర్థం కావడం లేదు.
ఎంపీసీట్లను క్లీన్ స్వీప్ చేయబోతున్న జగనన్న!
Monday, December 23, 2024