‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అని ఉర్దూ సామెత. తేడా గాడైన ఒక దొంగ పోలీస్ ని వెంటపడి తరిమేడని ఈ సామెత అర్థం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళిని గమనిస్తూ ఉంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. ప్రపంచం మొత్తం ఏ ఆరోపణలనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తుంటుందో, ఆయన తీరును ఎలా అనుమానిస్తుందో.. అదే నిందలను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ముడిపెట్టి విమర్శించడం వైసిపి నాయకులకు మాత్రమే చెల్లింది.
చంద్రబాబు నాయుడు జనసేన తో పాటు బిజెపిని కూడా తమ కూటమిలోకి కలుపుకుంటూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా భేటీ అయి మంతనాలు సాగించిన వైనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టిస్తున్నట్లుగా ఉంది. మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని జనసేన ని పవన్ కళ్యాణ్ తొలినుంచి చెబుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీతో తాము సఖ్యంగా ఉంటున్న కారణంగా అది సాధ్యం కాకపోవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలగంటూ వచ్చింది. కానీ అమిత్ షా, జె పి నడ్డాలతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత వారి నమ్మకం గల్లంతయింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమకు ముప్పు తప్పదనే భయం మొదలైంది.
అందుకే ముందుగానే చంద్రబాబు నాయుడు మీద ఎదురు దాడికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు అమిత్ షా వద్దకు పొత్తుల కోసం వెళ్లలేదని, తాను కేసులలో ఎక్కడ ఇరుక్కుంటానో అనే భయంతో ముందు జాగ్రత్తగా వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ‘‘కేసుల భయంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు’’ అనే ఆరోపణ ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. చంద్రబాబు పాలన కాలంలో అవినీతి జరిగిందని అంటూ.. నాలుగేళ్లుగా నిందలు వేస్తున్న ఏపీ సర్కారు, చంద్రబాబుపై ఇప్పటిదాకా గట్టిగా ఏ కేసునూ పెట్టలేకపోయింది. బలవంతంగా వారు ఇరికించాలనుకోవడం తప్ప చంద్రబాబుకు కేసుల భయం లేదు.
అయితే ప్రస్తుతం బెయిలు మీద జైలు బయట ఉండి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తనపై ఉన్న అనేక అవినీతి కేసులను మాఫీ చేయించుకోవడానికి కేంద్రం పాదాల చుట్టూ తిరుగుతున్నాడనే ఆరోపణలు చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డి పాత్ర గురించి సర్వత్రా చర్చ మొదలైన తరువాత జగన్ ఢిల్లీ టూర్ లు కూడా పెరిగాయి. తమ్ముడు అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో ఇరుక్కుంటే తన పేరు కూడా బయటకు వస్తుందనే భయంతో జగన్ ఢిల్లీ పెద్దలను ఆశ్రయిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉండగా, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినా కూడా కేసులు భయంతోనే వెళ్లారని ప్రచారం చేయడం సజ్జల మార్కు కుట్రగా కనిపిస్తోంది. తమకు అలవాటైన లోపాయికారీ పనులను ఎదుటివారి మీద నిందలుగా వేయడం వైసిపికి అలవాటే అని పలువురు విమర్శిస్తున్నారు.