విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతోటే.. యావత్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ముసుగులో విశాఖలో ఆ పార్టీకి చెందిన పెద్దపెద్దనేతలంతా విచ్చలవిడిగా భూదందాలు కొనసాగిస్తూ ఉన్నారనే గుసగుసలు సర్వత్రా వినిపిస్తూనే ఉంటాయి. మరోవైపు విశాఖ రాజధాని అంశాన్ని భుజాన మోస్తున్న ఉత్తరాంధ్ర నాయకులు.. చాలా తీవ్రమైన డిమాండ్లు వినిపిస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. విశాఖ రాజధాని వద్దనే వారిని ఉత్తరాంధ్రలో అసలు ప్రజలు తిరగనివ్వకూడదని పిలుపు ఇస్తున్నారు. మిగిలిన ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఉత్తరాంధ్రకు రావాలంటే.. వీసా తెచ్చుకోవాలని గౌరవనీయ మంత్రిగారు భావిస్తున్నారో ఏమో తెలియదు!
‘నిజానికి విశాఖ రాజధానిని వ్యతిరేకించే వాళ్లని ఉత్తరాంధ్రలో తిరగనివ్వొద్దు’ అనే మాటను మంత్రి అప్పలరాజు తొలిసారిగా చెప్పడం లేదు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ మంత్రులందరూ ఆ మాటను గతంలోనూ పదేపదే చెప్పారు. ముఖ్యమంత్రి కూడా పలుమార్లు సెలవిచ్చారు. అయినా సరే.. ఉత్తరాంధ్ర ప్రజలు వారి సలహాలను పట్టించుకోలేదు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారని వారు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం, జనసేన నాయకులకు ఉత్తరాంధ్రలో ఎప్పటిలాగా ఆదరణ మెండుగా లభిస్తూనే ఉంది. చంద్రబాబునాయుడు ఇటీవల విజయనగరంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహిస్తే జనం ఎగబడి వచ్చారు.
‘విశాఖ రాజధాని వద్దనే వారిని ఇక్కడ తిరగనివ్వొద్దు’ అనే మంత్రుల మాటను ప్రజలు పట్టించుకోవడం లేదా, విశాఖ రాజదానితో ఉత్తరాంధ్ర అద్భుతం అయిపోతుందని చెబుతున్న మాటలను నమ్మడం లేదా తెలియదు. కానీ.. విపక్షాలకు అక్కడ ఎంతో ఆదరణ లభిస్తూనే ఉంది.
అయితే ప్రజల మనోగతం ఎలా ఉన్నదో తెలుసుకోకుండా.. తమ మాటలను విశ్వసించడం లేదనే వాస్తవాన్ని గ్రహించకుండా అప్పలరాజు తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఇతర నాయకులు మాత్రం అదే తరహాలో చెలరేగిపోతున్నారు. ఎంతసేపూ ప్రతిపక్షాలను నిందించడానికి విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారనే అస్త్రాన్ని మాత్రమే వాడుతున్నారు. కానీ అసలు విశాఖ కు రాజధాని అనేది ఇదిగో అదిగో వచ్చే నెలలోనే అంటున్నారే తప్ప.. దాన్ని అసలు ఎలా సాకారం చేస్తారో కూడా చెప్పడం లేదు. కేవలం విపక్షాలను ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించడానికి తప్ప.. వారికి ఈ అంశం మరో తీరుగా ఉపయోగపడుతున్నట్టు లేదు.
ఉత్తరాంధ్రకు రావాలంటే వీసా కావాలా అప్పల్రాజూ!
Wednesday, January 15, 2025