ఉత్తమ్ భార్యకోసం ఇంత చేటు గొడవనా?

Monday, December 23, 2024

ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలా వద్దా? అనే విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికలకు సంబంధించి తొలి ముసలం పుట్టింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నా తర్వాత.. ఇన్నాళ్లుగా, అంటే అభ్యర్థిత్వాలకు దరఖాస్తులు స్వీకరించే పర్వం ముగిసేవరకు, అంతా ప్రశాంతంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి – ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా ఉంది. దానికి తగ్గట్టుగా గాంధీభవన్ లో జరిగిన పీఈసీ సమావేశంలో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకపూని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా ఎందుకు జరిగిందా? అనుకుంటున్నారా? కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలనే కోరిక వల్ల!

తెలంగాణలో ఉన్నది 119 సీట్లు! అందులో గెలిచే సీట్లు అనిపించేవి తగుమాత్రంగానే ఉంటాయి. ఉన్న సీట్ల కోసం చాలా చాలా కొట్లాటలు జరుగుతున్నాయి. 51 సీట్లను బీసీలకు ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. ఎస్సీ, ఎస్టీ సీట్లను ఎటూ వారికే ఇవ్వక తప్పదు. బీసీలు అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినా.. మొత్తానికి జనరల్ కేటగిరీ కోసం మిగిలే సీట్లు పరిమితంగానే ఉంటాయి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల సంఖ్య ఎక్కువ. అందరూ కొమ్ములు తిరిగిన పెద్ద నాయకులే. మరి ఈ రెడ్లు అందరికీ టికెట్లు ఇవ్వాలంటే.. జనరల్ కేటగిరీలోని మిగిలిన కులాలకు చాలా అంటే చాలా తక్కువ సీట్లు మిగులుతాయి.

అసలే పరిస్థితి ఇంత కనాగష్టంగా ఉండగా.. ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్ కావాలంటే.. ఇక మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ నాయకులు ఎంత గొప్ప వారైనా సరే.. ఇలాంటిది సంకటస్థితి. కానీ మాజీ పీసీసీ చీఫ్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తనకు- తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతున్నారు. ఆయన పట్టుబట్టి అధిష్ఠానం నుంచి ఆ మేరకు తెచ్చుకుంటే దిగుల్లేదు. కానీ.. ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి సుముఖంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి ఒక ప్రతిపాదన పంపాలని ఉత్తమ్ ఆయనను డిమాండ్ చేశారు. అలాంటి ప్రతిపాదన పీసీసీ నుంచి తాను పంపనని, ఆ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని రేవంత్ తేల్చేశారు. పీసీసీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సిందే.. అని ఉత్తమ్ డిమాండ్ చేయడంతో.. నాకు డిక్టేట్ చేయవద్దు అంటూ రేవంత్ ఆగ్రహించేశారు. అంతే.. ఉత్తమ్ అలిగి సమావేశంనుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇంతింత సీనియారిటీ ఉన్న నాయకులు.. పార్టీని సమిష్టిగా గెలిపించుకోవాలనే ఆలోచన లేకుండా ఇలాంటి అలకలు ఏమిటా? అని ప్రజలు విస్తుపోతున్నారు. ఒక రకంగా పెద్ద రాజకీయ కుటుంబాల్లో అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు ఉంటే కూడా ఒక్కోసారి రెండుసీట్లు ఇస్తుంటారు. సాధారణంగా వారు రెండు కుటుంబాలుగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఒకే కుటుంబంలో భార్యాభర్తలు తామిద్దరికీ టికెట్ కావాలని పట్టుబట్టడం దానికోసం అలగడం.. పార్టీకి నష్టం కలిగేలా, పరువుపోయేలా ప్రవర్తించడం బాగోలేదని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles