తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాజీ పీసీసీ చీఫ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తంమకుార్ రెడ్డి ఒక కీలక నాయకుడు. పార్టీ అధిష్ఠానం వద్ద తన మాట చెల్లుబాటు చేసుకోగల కొద్ది మంది నాయకుల్లో కూడా ఒకరు. అలాంటి ఉత్తం కుమార్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉండగల విజయావకాశాల గురించి ఎన్నికలకు ఇంకా ఆరునెలల ముందే చేతులెత్తేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన సూటిగా కాంగ్రెసు ఓడిపోతుందని చెప్పకపోయినప్పటికీ.. కాస్త నర్మగర్భంగా అలా ధ్వనించే మాటలు అంటున్నారు.
తెలంగాణలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తాయని తాను అనుకుంటున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇలా రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే.. కాంగ్రెసు పార్టీకి లాభం జరుగుతుందని కూడా ఆయన తన అంచనాను వివరించారు. ఈ వ్యాఖ్యలను ఇంకో కోణంలోంచి గమనిస్తే.. లోక్ సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే గనుక.. కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటున్నట్టే అనుకోవాలి.
కాంగ్రెస్ కు ఎడ్వాంటేజీ అవుతుందని అనడం వెనుక ఆయన విశ్లేషణ ఏమిటో మనకు తెలియదు గానీ.. ఎంతగా కోరుకున్నా.. రెండింటికీ ఒకేసారి ఎన్నికలు ఎలా వస్తాయి? లోక్ సభను నరేంద్రమోడీ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తే తప్ప అది సాద్యం కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతాయి. తన భారాస మీద, జాతీయ రాజకీయాల మీద గరిష్టంగా ఫోకస్ పెట్టడానికి మరింత ఎక్కువ వ్యవధి కావాలని కేసీఆర్ తలపోస్తే గనుక.. ఆయన కాస్త ముందుగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. ఇంకా తొందరగానే ఎన్నికలు రావొచ్చు. అంతే తప్ప లోక్ సభ రద్దు అనేది జరిగే పని కాదు. ఏతావతా.. ఉత్తమ్ కుమార్ అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ కు లాభం జరగడం కూడా సాధ్యం కాదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మంచిరోజులు చూడాలంటే గనుక.. ఇలాంటి కాకుల లెక్కలు చెప్పడం కాదు. పార్టీలోని నాయకులు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడం మానేయాలి. పార్టీలో నియోజకవర్గ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు నేతల మద్య ఉన్న ముఠా కుమ్ములాటలు సమసిపోవాలి. బతుకంతా ఇతర నాయకులత మీద పితూరీలు చెప్పడంతోనే గడిపేస్తూ ఉండే కుత్సిత నాయకుల బుద్ధులు మారాలి. ఇవన్నీ జరగకుండా.. ఎన్ని ఎన్నికలు కలిసి వచ్చినాసరే.. పార్టీ లాభపడడం అనేది జరగదు.
ఉత్తంకుమార్ ముందే చేతులెత్తేస్తున్నారా?
Wednesday, January 22, 2025